/rtv/media/media_files/2025/03/21/u9rpuv5QCiUl4P8p6djD.jpg)
trumpedu
ప్రపంచంలో అధినేతల రాజకీయ జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. ఇప్పటికే నాలుగు దేశాల ప్రధానులను ప్రజలు పదవి నుంచి దింపేశారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే పరిస్థితి దిశగా ప్రయాణిస్తున్నారు. పది నెలల క్రితం అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ ను నెత్తిన పెట్టుకున్నారు. ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ పదవి చేపట్టిన దగ్గర నుంచీ ట్రంప్ ఆ ప్రజల భరతమే పడుతున్నారు. దీంతో ఇప్పుడు పది నెలల తర్వాత సొంత దేశంలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయనేమీ శాంతి కాముకుడు కాదంటూ అమెరికన్లు విమర్శిస్తున్నారు.
దేశం కన్నా సొంత ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి..
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు ట్రంప్. దీని కారణంగా ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టడమే కాక అమెరికన్లపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అసలు రాగానే అక్రమ వలసలు, ఫెడరల్ ఉద్యోగాలు అంటూ సొంత దేశంలోనే చాలా మందికి జీవితం లేకుండా చేశారు. తరువాత అమెరికాతో వాణిజ్య డీలింగ్స్ ఉన్న అన్ని దేశాలపై సుంకాలను మోత మోగించారు. ఈ టారిఫ్ల బెదిరింపులతో తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. కొన్ని దేశాలు తమకు ఇష్టం లేకపోయినా..తప్పకట్రంప్ ఆంక్షలకు తలొగ్గుతున్నారు. అలా చేయని భారత్, చైనా, రష్యాలతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆ దేశాలకు పెద్ద నష్టం వాటిల్లకపోయినా..అమెరికాకు మాత్రం బాగానే దెబ్బ అవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి నానా అవస్థలు పడుతున్నారు అమెరికన్లు. దానికి తోడు ప్రతీ పెద్ద స్టేట్ లోనే నేషనల్ గార్డ్స్ డిప్లాయ్ చేసి నియంతలా మారుతున్నారు ట్రంప్. ఇది కూడా అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను దారి తీస్తోంది. తాజాగా ఆయన అనుచరుడు, సన్నిహితుడు హత్యకు గురవ్వడమే ఇందుకు ఉదాహరణ.
ప్రస్తుతం ట్రంప్ ఎదుర్కొంటున్న అతి పెద్ద విమర్శ ఏంటంటే...ఆయన అమెరికా ఫస్ట్ అనిచెబుతున్నప్పటికీ...దేశ ప్రయోజనాల కంటే తనను తాను అధినేతగా నిరూపించుకోవడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ట్రంప్ ఒక్కరే కాదు ఆయన అనుచరులు కూడా అదే పనిలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ట్రంప్ పాలనపై తాజాగా నిర్వహించిన సర్వేలో ఆయనకు వ్యతిరేకంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 1,084 మంది US పెద్దలపై నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ సర్వే ప్రకారం, అధ్యక్షుడిగా ట్రంప్ ను 42% ఆమోదించగా.. 56% మంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే ఆన్ లైన్ లో 30, 196 మందితో నిర్వహించిన సర్వేలో కూడా 43 శాతం మంది ఆయనను ఆమోదించగా..57 శాతం మంది తిరస్కరించారు. ద్రవ్యోల్బణాన్ని ట్రంప్ ట్రీట్ చేసిన తీరుపై చేసిన సర్వేలో 39% మంది ఆమోదించగా.. వాణిజ్యం, సుంకాలను ఆయన నిర్వహించిన తీరును 41% మంది ఓకే అన్నారు.