/rtv/media/media_files/2025/01/19/ecV9yfrKVGi3adZGOii0.jpg)
neetha ambani, Trump and Mukesh Ambani
రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ముందు అక్కడ విందును ఏర్పాటు చేశారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు హాజరయ్యారు. ఈ ప్రత్యేక వేడుకకు ప్రపంచంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, అలాగే ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు. ఎం3ఎం డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సాల్, ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా వంటి ఇతర భారత పారిశ్రామికవేత్తలు కూడా ఈ విందుకు హాజరయ్యారు.
భారత్‌లో ట్రంప్ టవర్స్ ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఉన్న కల్పేష్ మెహతా ఇన్‌స్ట్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు. అందులో ట్రంప్, ముకేశ్ అంబానీ, నీతా అంబానీలతో కలిసి దిగిన ఫొటోలు చూడవచ్చు. ముఖేష్ అంబానీ బ్లాక్ కలర్ సూట్ ధరించగా.. నీతా అంబానీ పొడవాటి ఓవర్ కోట్‌లో పట్టుచిరలో కనిపించారు. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ కూడా కనిపించారు. అలాగే ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందిస్తున్న వీడియోను కూడా కల్పేష్ షేర్ చేశారు.
ఇదిలాఉండగా వాషింగ్టన్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో విపరీతంగా చలి ఉంది. దీంతో బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ రోటుండా లోపల ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే నగరంలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం జరగడం వల్ల గతంలోలాగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరుకాలేరు. కానీ పలువురు ప్రముఖులు, దేశాధినేతలు మాత్రం హాజరుకానున్నారు.