SCO Summit: చైనాకు వెళ్లనున్న ఆ 20 మంది లీడర్లలో మోదీ, పుతిన్

చైనాలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా 20 మందికి పైగా ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లియు బిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.

New Update
SCO Summit in China

SCO Summit

చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా 20 మందికి పైగా ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లియు బిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు SCO చరిత్రలోనే అతిపెద్దది అని లియు బిన్ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. అంతేకాకుండా, ఇందులో పాల్గొంటున్న దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనడం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఆయన చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ ఘర్షణలు రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త మలుపుకు సంకేతంగా భావిస్తున్నారు. SCOలో సభ్య దేశాలుగా ఉన్న చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల నాయకులు ఒకే వేదికపైకి రానున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం, కనెక్టివిటీ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ఉగ్రవాదంపై భారత్ తన గట్టి వైఖరిని స్పష్టం చేయనుంది. ముఖ్యంగా సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదంపై దృష్టి సారించనుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఇటీవల రష్యాకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు, సుంకాల నేపథ్యంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం అమెరికాకు ఒక స్పష్టమైన సందేశం పంపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ సదస్సులో ఎస్సీఓ సభ్య దేశాలే కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఇది ప్రపంచ వేదికపై ఎస్సీఓ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ సదస్సు భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అనేక ముఖ్యమైన ఒప్పందాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు