gaza: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం తెల్లవారుజామున ఆమోదం తెలిపింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఈ నిర్ణయం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఒక కీలకంగా మారబోతుంది.

New Update
Israel PM Netanyahu

Israel PM Netanyahu

గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం తెల్లవారుజామున ఆమోదం తెలిపింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఈ నిర్ణయం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఒక కీలకంగా మారబోతుంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం, గాజా సిటీతో పాటు స్ట్రిప్ మధ్య ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఆపరేషన్ నాలుగు నుంచి ఐదు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. ఈ సైనిక చర్యల వల్ల గాజాలోని దాదాపు 10లక్షల మంది ప్రజలు నివాసాలను కోల్పోయి, దక్షిణ ప్రాంతాలకు తరలివెళ్లే పరిస్థితి ఏర్పడనుంది.

అంతర్జాతీయంగా ఆందోళన:

ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాజాలో ఇప్పటికే నెలకొన్న మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సైనిక చర్య వల్ల బందీలుగా ఉన్నవారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని బందీల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాను ఆక్రమించుకోవడం అనేది ఇజ్రాయెల్‌కు ఒక "బ్లాక్ హోల్" లా మారుతుందని ఇజ్రాయెల్ సైనిక ఉన్నతాధికారులు కూడా హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవడం లేదా పాలించడం తమ ఉద్దేశం కాదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ను పూర్తిగా తొలగించి, ఆ తర్వాత పాలనా బాధ్యత హమాస్‌కు మద్దతు ఇవ్వని అరబ్ బలగాలకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. గాజాలో తమ భద్రతకు అవసరమైన 'సెక్యూరిటీ పెరిమీటర్' మాత్రమే ఏర్పాటు చేసుకుంటామని నెతన్యాహు ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వివాదాస్పద నిర్ణయంతో ఇజ్రాయెల్ మరోసారి అంతర్జాతీయంగా విమర్శలపాలయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం గాజా యుద్ధాన్ని ఏ దిశగా మారుస్తుందో, అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు