/rtv/media/media_files/2026/02/13/tarique-rahman-2026-02-13-17-26-18.jpg)
Tarique Rahman
బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (NCP) అధికారం దక్కించుకుంది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల విజయం సాధించింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రెడీ అవుతోంది. అయితే తారిఖ్ రెహమాన్ బంగ్లా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత అధికారంలోకి వచ్చిన తాత్కాలిక యూనస్ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరిగాయి. మరీ తారిక్ రెహమాన్ ప్రధాని అవ్వడం భారత్‌కు లాభామా ? నష్టమా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధానమంత్రి ఖలిదా జియా దంపతుల కొడుకే తారిక్ రెహమాన్. 2001-2006 మధ్య రెండోసారి ఖలిదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు తారిక్ రెహమాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అప్పుడే ఆయనపై పలు అవినీతి కేసులు నమోదవ్వడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో పాటు బంగ్లాదేశ్ విపక్షాలు ఆయన్ని డార్క్ ప్రిన్స్‌గా పిలిచాయి. ఆ తర్వాత హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెహమాన్ ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. అనంతరం అనారోగ్యానికి గురైన తారిక్ చికిత్స కోసం 2008లో లండన్‌కు వెళ్లారు. అప్పటినుంచి ఆయన అక్కడే ఉంటూ బీఎన్‌పీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.
Also Read: స్టాలిన్ సంచలన నిర్ణయం.. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు
గతేడాది డిసెంబర్‌లో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురవ్వడంతో రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు వచ్చారు. డిసెంబర్ 30న తల్లి చనిపోయారు. ఆ తర్వాత తారిక్ రెహమాన్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల షరీఫ్ ఉస్మాన్ హాదీని హత్య చేయడం, ఆ తర్వాత మైనార్టీలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరగడంతో బంగ్లాదేశ్‌లో అస్థిరత నెలకొంది. ఈ సమయంలో రంగంలోకి దిగిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదంతో విస్తృత ప్రచారం చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు.
యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దూరమయ్యాయి. గత 18 నెలలుగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ గెలవడం కీలకంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో ఎన్నికల ఫలితాలపై పోస్టు చేశారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన పోస్టుకు BNP కూడా ధన్యవాదాలు తెలిపింది. అలాగే తారిక్ రెహమాన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడి అభినందలను తెలిపారు.
భారత్‌కు కలిసొచ్చే అంశమే
ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జమాత్ ఏ ఇస్లామీ పార్టీ భారత్‌కు వ్యతిరేకం. అయితే తారిక్ రెహమాన్ ముందు నుంచే ఆ పార్టీని దూరం పెట్టారు. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. భారత్‌కు రెహమాన్ సానుకూలంగా వ్యవహరించే ఛాన్స్ ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే రెహమాన్ తల్లి ఖలిదా జియా పాలనలో భారత్‌తో సంబంధాలు అంతగా ఉండేవి కావు. కానీ రెహమాన్ నేతృత్వంలో పరిస్థితులు మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
గతంలో కూడా రెహమాన్ భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను రీసెట్ కోరుతున్నానని.. ఇది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని, తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించుకుంటామని, అలాగే హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక సరిహద్దు నియంత్రణ విషయంలో రెహమాన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్రమ వలసదారుల అంశం కీలకంగా మారింది. బంగ్లాదేశ్, భారత్ మధ్య 4100 కి.మీ వరకు సరిహద్దు ఉంది. 2024 జూన్ తర్వాత వెయ్యికి పైగా చొరబాటు ఘటనలు జరిగాయి.
దౌత్య సంబంధాలు పెరిగే అవకాశం
మరోవైపు భారత్, బంగ్లా మధ్య ప్రతి సంవత్సరం 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల దాకా మనకి వాణిజ్య మిగులు ఉంటోంది. భారత్ నుంచి బంగ్లాదేశ్ కాఫీ, టీ, ఆటో విడి భాగాలు, ఉక్కు, స్టీల్, విద్యుత్, స్టీల్, పత్తి, ప్లాస్టిక్ లాంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే పత్తిలో 80 శాతం మననుంచే వెళ్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారత్ కీలకంగా ఉంది. అందుకే దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్‌తో రెహమాన్ దౌత్య సంబంధాలు పెంచుకునే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Follow Us