US-India: భారత్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం..10 ఏళ్ళకు అంగీకారం

ఇండియా , అమెరికాల మధ్య నెమ్మదిగా మళ్ళీ దోస్తీ కుదురుతోంది. తాజాగా రెండు దేశాల మధ్యా కీలక డీల్ కుదిరింది. తమ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. భారత్, అమెరికాలు ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

New Update
us-india

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.  ఈ క్రమంలో రెండు దేశాలు చాలా ముఖ్యమైన ఒప్పందాన్ని చేసుకున్నాయి. రక్షణకు సంబంధించి సైనిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, అమెరికాలు కీలక ఒప్పందాన్ని చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాలకు సంబంధించి సంతకాలు చేశాయి. మలేసియా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ భేటీ అయ్యారు. ఇందులో రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

10 ఏళ్ళ పాటూ రక్షణ రంగ సహాయం..

ఈ కొత్త ఒప్పందం ద్వారా భారత్, అమెరికా ఒక దానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే రక్షణ రంగంలో సాంకేతిక సహాయాన్ని కూడా అందించుకోనున్నాయి.  ఈ ఒప్పందంపై యూఎస్ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ మాట్లాడుతూ...భారత్, అమెరికాల మధ్య ఇలాంటి ఒప్పందం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. 10 ఏళ్ళ పాటూ రెండు దేశాలు కలిసి పని చేస్తాయని తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడం, సైనిక సమన్వయాన్ని మరింతగా పెంచడం, రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. అలాగే మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్‌లో రక్షణ తయారీని మరింత పెంచడం ముఖ్య ఉద్దేశమని పీటర్ హెగ్సెత్ చెప్పారు. 

ఈ రక్షణ ఒప్పందం భారత్, అమెరికా రక్షణ సంబంధాలకు దిశా నిర్దేశం చేస్తుందని భారత డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ తెలిపారు. ఇది ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతమని చెప్పారు. అమెరికా నుంచి భారత్‌కు రావాల్సిన ప్రధాన రక్షణ వస్తువుల విక్రయాలపై వేగవంతమైన నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాల మంత్రులూ చర్చించారు. భారత్‌లోనే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా ఎఫ్ 414 ఇంజిన్లను ఉత్పత్తి చేసే ప్రతిపాదిత ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని రాజ్‌నాథ్ సింగ్ హెగ్సెత్‌కు సూచించారు. 

Advertisment
తాజా కథనాలు