ఎంత మిత్రదేశమైనా భారత్ కు సుంకాలు విధించడం మానేయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈరోజు వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ఇండియా చాలా ఎక్కువ సుంకాలను విధిస్తోందని...వాటివల్ల ఆ దేశంలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయని చెప్పారు. ఈ అంశాన్ని భారత్ తో చర్చించామని...వారు విధిస్తున్న సుంకాలు ఎలా భారం అవుతున్నాయో చెప్పామని తెలిపారు. అందుకే సుంకాలను తగ్గించడానికి ఒప్పుకుందని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి ఇండియాతో ప్రతీకార సుంకాలు ఉంటాయని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
టెస్లా కోసం ప్రయత్నాలు..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110శాతం సుంకాలు విధిస్తోంది. ఈ విషయాన్ని మస్క్ చాలాసార్లు చెప్పారు. టెస్లా కార్లను సుంకాలు లేకుండా ప్రవేశపెట్టాలని అతను చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే భారత్ మాత్రం సుంకాలను తగ్గిస్తుందో లేదో ఇంకా చెప్పాలి. ఈ విషయంపై చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది.
వత్తాసు పలికిన జైశంకర్..
నిన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతునిస్తూ మాట్లాడారు. లండన్ పర్యటనలో ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర అనే అంశంపై మాట్లాడుతూ సుంకాల గురించి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమెరికా, భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు జైశంకర్ తెలిపారు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటనలో ఉన్నారని..సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చిస్తున్నారని తెలిపారు. సుంకాల ఒప్పందంపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని చెప్పారు.
Also Read: USA: స్టార్ షిప్ ఎఫెక్ట్..240 విమానాల రాకపోకలకు అంతరాయం