/rtv/media/media_files/2025/10/14/pakistan-and-israel-2025-10-14-13-02-23.jpg)
Pakistan and Israel
Gaza peace deal : రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్, గాజాలలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది. అయితే ఈ ఒప్పందంపై పాకిస్తాన్ భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన సంఘటనల ప్రకారం, గాజా శాంతి ఒప్పందం (ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-అంశాల ప్రణాళిక)నికి పాకిస్తాన్ మొదట్లో మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దేశీయ ఒత్తిడి కారణంగా వ్యతిరేకతగా మారింది. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి.
1. అంతర్గత ఒత్తిడి & యూటర్న్ (U-Turn)
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా పాకిస్తాన్ పాలకులు మొదట ఈ శాంతి ప్రణాళికను స్వాగతించారు. మద్దతు తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై పాకిస్తాన్‌లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాన్య కార్యకర్తలు ఈ ప్రణాళిక పాలస్తీనా రాజ్యానికి వ్యతిరేకంగా ఉందని, అమెరికాకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ తీవ్రమైన అంతర్గత ఒత్తిడి కారణంగా, పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలోనే తమ వైఖరిని మార్చుకుంది (యూటర్న్ తీసుకుంది). ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ట్రంప్ ప్రకటించిన 20-అంశాల ప్రణాళిక ముస్లిం దేశాలు ప్రతిపాదించిన అసలు ముసాయిదా కాదని , తమ ముసాయిదాలో మార్పులు జరిగాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మాజీ రాయబారులు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది.గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళిక, ముస్లిం దేశాలు ఇచ్చిన డాక్యుమెంట్ భిన్నంగా ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ చెప్పారు.
2. పాలస్తీనా పట్ల స్థిర వైఖరి
పాకిస్తాన్ విదేశాంగ విధానం ఎల్లప్పుడూ పాలస్తీనాకు మద్దతుగా ఉంటుంది. 1967 పూర్వ సరిహద్దులతో, తూర్పు జెరూసలేం (అల్-ఖుద్స్ అల్-షరీఫ్) రాజధానిగా ఒక సార్వభౌమ ,ఆచరణీయమైన పాలస్తీనా దేశం ఏర్పడాలని పాకిస్తాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. అందువల్ల శాంతి ప్రణాళిక ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉందనే భావన వ్యతిరేకతకు దారితీసింది.ట్రంప్ ప్రతిపాదిత గాజా శాంతి ప్రణాళికకు పాకిస్తాన్ మద్దతివ్వడం దీర్ఘకాలంగా ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి భిన్నంగా ఉందని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి చెప్పారు."పాకిస్తాన్‌లో ప్రజల స్పందన వ్యతిరేకంగా ఉంది" అని మలిహా లోధి జర్మన్ వార్తా సంస్థ డీడబ్ల్యూతో చెప్పారు.‘‘ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అస్పష్టంగా ఉంది. అది అనేక రూపాల్లో ఇజ్రాయెల్‌కు మేలు చేసేలా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమణను ఆపడంలో ఈ ప్రణాళికకు చిత్తశుద్ధి లేదు. అందుకే ఇక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి" అని ఆమె చెప్పారు.
3. ఒప్పందంలోని వివాదాస్పద అంశాలు
ట్రంప్ ప్రణాళికలో పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలు (ముఖ్యంగా తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ - TLP) ఇతర సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వీడాలని, గాజాకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉంది. హమాస్ నిరాయుధీకరణకు పాకిస్తాన్‌లోని మితవాద. అతివాద వర్గాలు అంగీకరించడం లేదు.గాజా పాలన కోసం ఏర్పాటు చేసే సంస్థకు అమెరికా అధిపత్యం వహిస్తుందనే అంశం కూడా విమర్శలకు గురైంది.
సంక్షిప్తంగా, పాకిస్తాన్ ప్రభుత్వం మొదట ఒప్పందాన్ని అంగీకరించినా, పాలస్తీనాకు సంబంధించిన కీలక డిమాండ్లను విస్మరించిందనే ఆరోపణలు ,అంతర్గత రాజకీయ ఒత్తిడి కారణంగా అది యూటర్న్ తీసుకుని ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ఈ వ్యతిరేకత కారణంగా పాకిస్తాన్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు, ర్యాలీలు జరిగాయి.
ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్‌కు ఎలాంటి వివాదాలు లేవు. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించేందుకు ఇస్లామాబాద్ ఇష్టపడటం లేదు. అరబ్ దేశాలతో మతపరంగా సన్నిహితమయ్యేందుకు ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను పాకిస్తాన్ పావులా వాడుకుంటోంది.అయితే అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు దగ్గరవుతున్నాయి. అలాంటప్పుడు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి పాకిస్తాన్‌కు సమస్య ఏంటి?ఈ ప్రశ్నకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్ విషయంలో మొహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన విధానమే ఆమోదయోగ్యమని ఆయన 2020లోనే స్పష్టం చేశారు. ఇతర దేశాలు ఏం చేసినా సరే మా విధానం సుస్పష్టం. పాలస్తీనీయులకు వారి హక్కులు దక్కేవరకు , మేం ఇజ్రాయెల్‌ను ఆమోదించేది లేదు అని మొహమ్మద్ అలీ జిన్నా 1948లోనే చెప్పారని ఆయన స్పష్టం చేశారు.ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తే అమెరికాతో ఇస్లామాబాద్ సంబంధాలు మరింత బలపడతాయని అనేక మంది వాదిస్తున్నారు. అయితే సగటు పాకిస్తానీయులలో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత వీధుల్లో ఎప్పుడూ బహిర్గతం అవుతూనే ఉంటుంది.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!