ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. ఈసారి ధరల విషయంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయోజనం కనిపించినట్లు ఓ వార్తా సంస్థ వివరించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ పర్యటనకు ముందే ఈ వివరాలు బయటపడ్డాయి. గతవారమే ఇరుదేశాలకు చెందిన బృందాలు ఢిల్లీలో చర్చలు జరిపాయి. మంగళవారం నుంచి భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక చర్చలు పారిస్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో అజిత్ డోభాల్ పాల్గొననున్నారు.
Also Read: నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!
భారత నౌకాదళం సరికొత్త విమాన వాహన నౌకను పూర్తిస్థాయిలో ఉపయోగించేందుకు ఈ ఒప్పందం చాలా కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విమానాల్లో భారత్ అభివృద్ధి చేసిన రాడార్‌ను సైతం అనుసంధానించాల్సి ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు 8 ఏళ్ల సమయం పడుతుంది. ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అలాగే దేశీయంగా తయారుచేసిన అస్త్ర, రుద్రం క్షిపణులను కూడా ఈ విమానాలకు ఇంటిగ్రేట్ చేయాలని కేంద్రం కోరుతోంది. అంతేకాదు వాయుసేనకు అవసరమైన 40 డ్రాప్ ట్యాంక్‌ల కొనుగోలు, తక్కువ సంఖ్యలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.