/rtv/media/media_files/2026/01/13/iran-trump-2026-01-13-22-11-00.jpg)
ఇరాన్ లో ఆందోళన కారులకు అమెరికా అధ్యక్షుడు మొదట నుంచీ మద్దతుగా ఉన్నారు. అవసరమైతే అక్కడి ప్రభుత్వం మీద సైనిక చర్య కూడా తీసుకుంటామని తెలిపారు. తాజాగా దీనికి సంబంధించి ఆయన మరో పోస్ట్ పెట్టారు. నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ నిరసనకారులకు పిలుపునిచ్చారు. పోరాటానికి సాయం చేస్తామని అన్నారు. హంతకులు, దాడులు చేసేవారి పేర్లను నమోదు చేసుకోండి. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారుల హత్యలు ఆపే వరకు ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా. నిరసనకారులకు సాయం అందిస్తా అటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వందలు కాదు వేలల్లో మరణాలు..
ఇరాన్ లో ఆందోళనల్లో ప్రజలు చనిపోతున్నారు కానీ ఇప్పటి వరకు 700 లేదా 800 మంది మాత్రమే చనిపోయారని అక్కడి ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. మహా అయితే రెండు వేలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. కానీ అవన్నీ తప్పుడు లెక్కలు అంటోంది స్థానిక వెబ్ సైట్. దీనికి సంబంధించి ఇరాన్ ఇంటర్నేషనల్ అనే వెబ్ సైట్ సంచలన కథనాన్ని పోస్ట్ చేసింది. ఆందోళనల్లో 12 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఈ వెబ్ సైట్ చెబుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలతో పాటూ భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్యాధికారులు.. తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేసినట్లు తెలిపింది. జనవరి 8, 9 తేదీల్లోనే ఈ మరణాలు చోటుచేసుకున్నాయని, ఓ ప్రణాళిక ప్రకారమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపింది. ఇరాన్ లో ఇంతకు ముందు ఎప్పుడూ ఈ తరహా ఆందోళనలు జరగలేదని ఆ వెబ్ సైట్ చెబుతోంది.
దేశవ్యాప్తంగా 31 ప్రావిన్సుల్లో 600లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు కొనసాగినట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ తెలిపింది. ఇందులో వందలాది మంది మరణించగా...పది వేలకు పైగా అరెస్ట్ అయ్యారని చెప్పింది. ఇరాన్ లో ఆందోళనలు ఇలాగే కొనసాగితే పెద్ద విధ్వంసానికే దారి తీయవచ్చని అంటోంది. ఇరాన్ పౌరుల న్యాయమైన డిమాండ్లను తప్పక వినాల్సిందేనని ఐరాస మానవ హక్కుల హైకమిషన్ కూడా పేర్కొంది.
Follow Us