Russia-Ukraine war: ముగింపులో కీలకంగా క్రిమియా.. దీని కోసమేనా 7లక్షల ప్రాణాలు బలి

2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో క్రిమియా కీలకంగా మారింది. జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటే వెంటనే సాధ్యమేనని ట్రంప్ ట్వీట్ చేశారు. దానికి క్రిమియా, నాటో కూటమిలో చేరే ఆలోచన రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు.

New Update
zelensky and putin

2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే టైం దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ యుద్దంలో 7లక్షల 90వేల మంది మరణించినట్లు అంచనా. ఈ యుద్ధం ముగింపులో క్రిమియా కీలకంగా మారింది. ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటే అది తక్షణమే సాధ్యమేనని, అయితే అందుకు క్రిమియా, నాటో కూటమిలో చేరాలనే ఆశలను వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ సూచించారు. ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా దేశాల్లోనూ ఆందోళన కలిగించాయి. ఎందుకంటే, జెలెన్స్కీ వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం కానున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

ఈ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భూభాగ సమగ్రతకు సంబంధించి ఎలాంటి రాజీ పడబోమని, తమ రాజ్యాంగం ప్రకారం ఏ భూభాగాన్ని కూడా వదులుకోవడానికి వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. క్రిమియా అంశంపై చర్చించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ట్రంప్ వైఖరి శాంతి చర్చలకు ఆటంకం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు. అంతలా క్రిమియాలో ఏం ఉంది.. అసలు క్రిమియా రెండు దేశా యుద్ధానికి ఎలా కారణమైందో చూద్దాం..

2014లో రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఈ ప్రాంతాన్ని తమ భూభాగంగా ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఇప్పటికీ గుర్తించలేదు. కానీ, తాజాగా జరిగిన చర్చల ప్రకారం, రష్యా క్రిమియాపై తమ సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్, అమెరికా సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని పట్టుబడుతోంది.

వ్యూహాత్మక స్థానం:
నల్ల సముద్రంలో క్రిమియా ద్వీపకల్పం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇక్కడ రష్యాకు చారిత్రకంగా ముఖ్యమైన నౌకాదళ స్థావరం (సెవాస్టోపోల్) ఉంది. ఈ స్థావరం రష్యాకు నల్ల సముద్రంలో తన సైనిక ఉనికిని, ప్రభావాన్ని కొనసాగించడానికి చాలా కీలకం. నాటో కూటమి నల్ల సముద్రంలోకి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ స్థావరం రష్యాకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

చారిత్రక సంబంధాలు: 
క్రిమియా 18వ శతాబ్దం నుంచి రష్యా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సోవియట్ యూనియన్ కాలంలో, 1954లో సోవియట్ నాయకుడు నికితా క్రుష్చెవ్ దీనిని ఉక్రేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌కు బదిలీ చేశారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, క్రిమియా ఉక్రెయిన్‌లో భాగంగా మారింది, కానీ అక్కడి ప్రజల్లో రష్యన్ మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే రష్యా ఈ ప్రాంతంపై చారిత్రక, సాంస్కృతిక హక్కులు ఉన్నాయని వాదిస్తుంది.

రష్యా అనుకూల జనాభా: 
క్రిమియా జనాభాలో ఎక్కువ మంది రష్యన్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఈ ప్రజలకు ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలనే కారణాన్ని చూపించింది. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న తర్వాత, రష్యా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)లో మెజారిటీ ప్రజలు రష్యాలో కలవడానికి మొగ్గు చూపారని రష్యా పేర్కొంది. అయితే, అంతర్జాతీయ సమాజం ఈ రెఫరెండంను గుర్తించలేదు.

భద్రతాపరమైన ఆందోళనలు: 
ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడానికి ప్రయత్నించడం రష్యాకు పెద్ద ఆందోళన కలిగించింది. ఉక్రెయిన్ నాటోలో చేరితే, నాటో సైనిక స్థావరాలు రష్యా సరిహద్దులకు మరింత దగ్గరగా వస్తాయి. ఇది రష్యా భద్రతకు ముప్పు అని పుతిన్ భావించారు. క్రిమియాను స్వాధీనం చేసుకోవడం ద్వారా, రష్యా తన దక్షిణ సరిహద్దులను సురక్షితం చేసుకోవాలని ఆలోచిస్తోంది. 

రాజకీయ ప్రయోజనాలు: 
క్రిమియా ఆక్రమణ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు దేశంలో ప్రజల మద్దతును పెంచడంలో సహాయపడింది. ఇది రష్యాను ఒక బలమైన శక్తిగా ప్రపంచానికి చూపించడానికి దోహదపడింది.

ట్రంప్, పుతిన్ మధ్య ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. పుతిన్ శాంతి ఒప్పందానికి షరతుగా డాన్బాస్, లుహాన్స్క్ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, అందుకు ప్రతిఫలంగా రష్యా సైనికులను ఖార్కివ్, సుమీల నుంచి వెనక్కి తీసుకుంటామని ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి అదనంగా, క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా ఉక్రెయిన్ అధికారికంగా అంగీకరించాలన్నది పుతిన్ డిమాండ్లలో ముఖ్యమైనది.

Advertisment
తాజా కథనాలు