/rtv/media/media_files/2025/08/12/brahmaputra-river-2025-08-12-08-55-43.jpg)
Brahmaputra River
China vs India : భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా కవ్వింపులు ఆపడం లేదు. భారత సరిహద్దుల వెంట వరుసగా వివాదస్పద నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఇప్పటికే టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన చైనా తాజాగా మరో కీలక ప్రాజెక్టుకు సన్నద్ధమవుతోంది. భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వేలైన్ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతూ ఈ రైల్వే లైన్‌ను నిర్మించనున్నది. ఈ రైల్వే మార్గంలోని కొంత భాగం వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి వెళ్లనున్నాయి. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన సమస్యలు తలెత్తె అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
షిన్‌జాంగ్‌లోని హోటాన్, టిబెట్‌లోని లాసాల ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్ పనులు చేపట్టనున్నారు. దీని నిర్మాణ పనులు ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 95 బిలియన్ యువాన్ల (రూ.1.15 లక్షల కోట్లు)మూలధనాన్ని ఖర్చు చేయనుంది. ఈ నిర్మాణానికి ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘షాంఘై సెక్యూరిటీస్ న్యూస్’ వెల్లడించినట్లు తన కథనంలో వివరించింది. ఈ రైల్వే మార్గంలోని కొన్ని భాగాలు చైనా-భారత్ సరిహద్దులోని ఎల్‌ఓసీ సమీపం నుంచి వెళ్లనున్నాయి. దీని మూలంగా సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో తూర్పు లడఖ్‌లో భారత్- చైనా సైనికుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయనుకుంటున్న సమయంలో ఈ రైల్వే లైన్ పనులు చేపట్టడం గమనార్హం. దీనిపై భారత్, బంగ్లాదేశ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చైనా మాత్రం మొండిగా ముందుకు పోతుండటం ఆందోళన కలిగిస్తోంది..
భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు కూడా
ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా మొదలు పెట్టింది. శనివారం మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా పాల్గొన్నారు. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ వివాద స్పద ప్రాజెక్టును చేపడుతోంది. దీనికోసం చైనా దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్‌లు (సుమారు రూ.14లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘చైనా యాజియాంగ్ గ్రూపు’ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన చైనా ప్రాజెక్టు నిర్మాణ పనులను దానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యామ్‌లు ఉంటాయని తెలుస్తోంది. టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో.. భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు.
చైనా ఈ ప్రాజెక్టును భారీ ఖర్చుతో చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా ఇది నిలువనుంది. దీనిద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్-అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది చైనా లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్‌కన్నా మూడురెట్లు పెద్దది. బ్రహ్మపుత్ర నది ‘గ్రేట్ బెండ్’గా పిలిచే ప్రాంతంలోని భారీ వంపు ప్రాంతంలో రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. దానికి స్వల్పదూరంలో నిటారుగా నీళ్లు పడటంవల్ల అక్కడ జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు నది గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రాంతానికి, పర్యావరణానికి తీరని నష్టం కలిగే అవకాశాలున్నాయి. దీనివల్ల అరుణాచల్, అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదలచేస్తే అక్కడి భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా చైనా మొండిగా ముందుకే వెళ్తుంది.
Also Read : కూలీలో మరో సర్ ప్రైజ్.. యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!