/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t113519623-2025-11-17-11-35-44.jpg)
Epstein Files: అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించిన విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ఆయన కోరారు. దీన్ని ఇంతకుముందు వ్యతిరేకించిన ట్రంప్.. ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం అమెరికాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ‘‘దాయడానికి ఏమీ లేదు’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు రిపబ్లికన్ పార్టీ విజయాల నుంచి దృష్టి మరల్చడానికే ‘రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్’లు సృష్టించిన తప్పుడు ప్రచారం అని ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసును ఉద్దేశించి ఆయన అన్నారు. రిపబ్లికన్లు మళ్లీ అమెరికా ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా కోరారు.
అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేయాలనే అంశంపై రిపబ్లికన్ పార్టీలోనే విభేదాలు తలెత్తాయి. ట్రంప్‌నకు గట్టి మద్దతుదారుగా ఉండే జార్జియా ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. దీనితో ట్రంప్ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, ఈ బిల్లు ఆమోదానికి కావాల్సినన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉండటంతోనే ఆయన ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమైనా.. ఆయన ఇలా యూ-టర్న్ తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు.
కాగా ఈ విషయమై ఈ వారంలోనే హౌస్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతానికి సంబంధించిన బిల్లు ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. రిపబ్లికన్లు పెద్ద సంఖ్యలో మద్దతు ఇస్తారని అంచనా వేస్తున్నారు. కెంటకీ ప్రతినిధి థామస్ మాస్సీ మాట్లాడుతూ.. దాదాపు 100 లేదా అంతకంటే ఎక్కువమంది రిపబ్లికన్లు బిల్లుకు ఓటు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వీటోను తిప్పికొట్టగలిగే మెజారిటీ రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాస్సీతో పాటు కాలిఫోర్నియా ప్రతినిధి రోఖన్నా కలిసి ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించడానికి గతంలో ‘డిశ్చార్జ్ పిటిషన్’ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో ట్రంప్ (Trump) పేరు కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నప్పటికీ.. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని వైట్‌హౌస్, స్పీకర్ జాన్సన్ తెలిపారు. ఇటీవల 2019 నాటి ఈమెయిల్ ఒకటి బయటపడటం సంచలనం రేపింది. దానిలో ట్రంప్‌నకు ‘‘ఆ అమ్మాయిల గురించి తెలుసు’’ అని రాసి ఉంది.
అసలేం జరిగిందంటే?
ఎప్‌స్టీన్ (Epstein) సెక్స్ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని తన నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడని అప్పట్లో వెలుగు చూసింది.
దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. నిందితుడిని అప్పుడు అరెస్టు చేసి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత విడుదలయ్యాడు. 2019లో ‘మీ టూ’ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు రావడంతో అతడిని అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. దాన్ని ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఎప్‌స్టీన్ మాజీ స్నేహితురాలు మాక్స్‌వెల్ ఈ దారుణాలకు సహకరించడంతో ఆమెకు ఇదివరకే 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
Follow Us