/rtv/media/media_files/2025/08/12/trump-deploys-national-guards-in-washington-dc-2025-08-12-11-39-11.jpg)
Trump deploys National Guards in Washington dc
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో ప్రజలు ఇప్పుడు రోడ్లైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. దీనికి ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న చారిత్రక నిర్ణయమే కారణం. డీసీలో అత్యవసర పరిస్థితి నెలకుందని ట్రంప్ అంటున్నారు. అక్కడ నేరాలు చాలా ఎక్కువ అయిపోయాయని..అందుకే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపానని చెబుతున్నారు. దాంతో పాటూ పబ్లిక్ సేఫ్టీ ఎమెర్జెన్సీని ప్రకటించారు. నేరాలను అరికట్టేందుకు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఫెడరల్ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే డీసీ మేయర్ మురియల్ బౌసర్ మాత్రం నేరాలు తగ్గుముఖం పట్టాయంటూ ప్రకటన చేయడం గమనార్హం. 2024లో హింసాత్మక నేరాలు 35 శాతం తగ్గాయి. అలాగే 2025 ప్రారంభంలో దోపిడీలు 25 శాతం, హత్యలు 12 శాతం తగ్గాయని తెలిపారు. ఇదంతా నగరాన్ని రక్షించడానికే అని నగర మేయర్ బౌసర్ అంటున్నప్పటికీ నియంతృత్వ చర్యగా కూడా అభివర్ణించారు.
నిరసనల హోరు...
అమెరికా అధ్యక్షుడు అన్నీ సడెన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు కూడా షాక్ అవుతున్నారు. వాషింగ్టన్ డీసీ లో నేషనల్ గార్డ్స్ ను ఉన్నట్టుండి దింపడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రంప్ ఏకంగా 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. అయితే వాషింగ్టన్ లో నేషనల్ గార్డ్స్ ను దింపడం ఇదేమీ మొదటి సారి కాదు. కానీ ఇప్పుడు సరైన కారణం లేకుండా అకస్మాత్తుగా ఇలా చేయడంతో గొడవ రాజుకుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల వాషింగ్టన్ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే 14వ స్ట్రీట్ లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా..ప్రజలు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఫాసిస్టులారా ఇంటికి వెళ్ళిపోండి అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.
నిరాశ్రయులను పంపేయడానికే..
నేరాలను అరికట్టేందుకు అని చెబుతూనే వాషింగ్టన్ లో ఉన్న నిరాశ్రయులను కూడా బయటకు పంపించేస్తామని అంటున్నారు ట్రంప్. వాషింగ్టన్‌లో దాదాపు 5,138 మంది నిరాశ్రయులైన పెద్దలు, పిల్లలు ఉన్నారు. వీరందరూ బయటకు వెళ్ళిపోవాలని ఆయన అంటున్నారు. కావాలంటే బయటకు ఒక ఇంటి స్థలమిస్తామని..కానీ డీసీని మాత్రం వదిలి వెళ్లిపోవాలని చెబుతున్నారు. అయితే ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు లాంటి వివరాలు మాత్రం ఏం చెప్పడం లేదు. ఇది ఒక రకంగా పేదరికాన్ని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం అని విమర్శకులు అంటున్నారు. ఇలా చేయడం రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా తెలియదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇది వాషింగ్టన్‌కు స్వేచ్ఛా దినం...తిరిగి మన రాజధానిని నేరరహితంగా మార్చబోతున్నాం అని చెప్పుకుంటున్నారు. అలాగే, నగరంలోని పార్కుల్లో ఉన్న నిరాశ్రయుల శిబిరాలను తొలగించే ప్రక్రియను కూడా అధికార యంత్రాంగం ప్రారంభించినట్టు చెప్పారు.