Rahul Gandhi Life : రాహుల్ గాంధీ.. ఒకప్పుడు జోకులకు ఆయన మీమ్ మెటీరియల్.. రాహుల్ ఏం చేసినా పనిగట్టుకోని ట్రోల్ చేసేవారు కొందరు. అయితే అదంతా గతం.. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇమేజ్ ఇప్పుడు వేరు. మోదీ(PM Modi) టార్గెట్‌గా రాహుల్ గాంధీ చేసిన ఎన్నో ఆరోపణలు నిజమయ్యాయన్న ప్రచారం కూడా ఉంది.
అందుకే రాహుల్‌తో ప్రత్యర్థి పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంతకీ రాహుల్ ఇమేజ్ ఇలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా? ఆయన రాజకీయ జీవితాన్ని(Political Life) మలుపు తిప్పిన ఘటన ఏంటి? ఆయన ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? రాహుల్ ఎవర్ననైనా ప్రేమించారా? నేడు రాహుల్ 55వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
సినిమాటిక్ లైఫ్..
రాహుల్ గాంధీ(Rahul Gandhi) జీవితంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. అవి చాలా వరకు సినిమాటిక్‌గా ఉంటాయి. రాహుల్‌కి ఊహ తెలిసే నాటికి నానమ్మ ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత తండ్రి రాజీవ్ గాంధీని తమిళ టైగర్స్-LTTE పొట్టనబెట్టుకుంది. చాలా విపత్కర పరిస్థితులను ఆ నాడు గాంధీ కుటుంబం ఎదుర్కొంది. ఎన్నో సవాళ్ల మధ్య రాహుల్ తల్లి సోనియా కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. ఈ క్రమంలో 2004 నాటికి రాహుల్‌కు రాజకీయ ప్రవేశం అనివార్యమైంది.
యువరాజుగా పుట్టాడని అనుకుంటారు కానీ..
1970 జూన్ 19న రాజీవ్ గాంధీ-సోనియాగాంధీ దంపతులకు రాహుల్ ఢిల్లీ(Delhi) లో జన్మించారు. అప్పటికే నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. దీంతో రాహుల్ గాంధీ కట్టుదిట్టమైన భద్రత మధ్య పెరిగారు. యువరాజుగా పుట్టాడని అందరు అనుకుంటారు కానీ రాహుల్‌గాంధీకి చిన్నతనంలో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేది.. దీని వల్ల ఆయన స్వేచ్ఛను కోల్పోయారు.
అమూల్యమైన బాల్యం చాలా వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిచిపోయింది. ఆయన రాజీవ్‌గాంధీ కుమారుడని తెలియకుండా పెంచాలని ఆయన కుటుంబం భావించింది. అందుకే రాహుల్ చిన్నతనంలోనే అనేక స్కూల్స్ మారారు. ఒకానొక సమయంలో రాహుల్‌తో పాటు చెల్లి ప్రియాంకగాంధీకు టీచర్లు ఇంటికి వచ్చి క్లాసులు చెప్పేవారు.
ఇది కూడా చదవండి: Rohit Vemula: రోహిత్ మరణంపై అనేక ప్రశ్నలు.. కులంపైనే ఎందుకింత చర్చ!?
అనేక కాలేజీలు చుట్టూ రాహుల్‌ని తిప్పారు..
1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చేరారు రాహుల్. అయితే 1990లో భారత్ వదిలి హార్‌వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ కూడా ఒక సంవత్సరమే చదివాడు. తన కొడుకును చంపుతారనే భయంతో అనేక కాలేజీలు చుట్టూ రాహుల్‌ని తిప్పారు సోనియా. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని రోలిన్స్.. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ లాంటి కాలేజీల్లో చదువుకున్నారు రాహుల్.. 2002లో బ్యాక్అప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేయడానికి ముంబై వచ్చిన రాహుల్‌ని అనివార్య కారణాలతో 2004లో పొలిటికల్ ఎంట్రీ చేయించారు సోనియా.. తండ్రి రాజీవ్ గాంధీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ అమేథీ నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.
రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు..
అయితే రాహుల్ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు.. ఆయన్ను వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ పనిగట్టుకోని ట్రోల్ చేసేవారే ఉండేవారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరకు పార్టీలో ఎన్నో బాధ్యతలు చేపట్టిన రాహుల్ ఇమేజ్ జోడో యాత్రతో ఒక్కసారిగా మారిపోయింది. సెప్టెంబర్ 7, 2022న రాహుల్ చేపట్టిన జోడో యాత్ర 145 రోజుల పాటు సాగింది. 4వేల కిలోమీటర్లపైగా కాలినడకన తిరిగారు రాహుల్. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులను కవర్ చేస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేసిన ఈ యాత్ర ఆయన్ను పరిణతి చెందిన రాజకీయనేతగా మార్చిందంటారు విశ్లేషకులు.
ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 పార్లమెంట్ సీట్లు ఇండియా కూటమికి 237 పార్లమెంట్ సీట్లు దక్కడం వెనుక రాహుల్ కృషే కారణమని చెప్పుకొవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 చోట మాత్రమే గెలిచారు రాహుల్. ఈ ఎన్నికల్లో మాత్రం పోటీచేసిన రెండు చోట్ల విజయం సాధించి సత్తా చాటారు ఆయన.
అటు రాహుల్‌గాంధీ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రజల్లో విపరీతంగా చర్చ జరుగుతుంటుంది. దీనికి కారణం ఆయన ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉండడమే. రాహుల్ గాంధీ లండన్‌లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారన్న ప్రచారముంది. ఆమె ప్రస్తుతం వెనిజులలో ఉంటున్నారట. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనీ అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదని చెబుతుంటారు.