ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం ఈడీ ఆయనను రౌస్ అవెన్యూలో హజరుపరిచింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: మా ఊరికి ఓట్లు కోసం రాకండి.. నోటాకు ఓట్లు వేస్తాం..
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు ఆయన్ని కలవనున్నట్లు సమాచారం. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం లేదా శనివారం వీళ్లు సీఈసీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, ఎస్పీ, సీపీఎం పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇదిలాఉండగా.. మద్యంకేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఆయన్ని 10 రోజుల పాటు కస్టోడియల్ రిమాండ్‌కు అప్పగించాలని కోరింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. చివరికి తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే సీఎం రిమాండ్‌పై ఏ క్షణంలోనైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా.. అరవిమద్ కేజ్రీవాల్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ప్రతిపక్షాలకు చెందిన సీఎంలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం దారుణమని ఆరోపించారు. బీజేపీతో సంబంధాలు ఉన్నవారు ఎన్ని అక్రమాలు చేసినా వాళ్లకు శిక్షలు పడవని.. సీబీఐ, ఈడీ దర్యాప్తులో ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటే బీజేపీలో చేరితే వాళ్లపై ఎలాంటి కేసులు ఉండవని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.