తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన ఫిక్స్ అవ్వడంతో ఒక్కసారిగా బీజేపీ నేతల్లో జోష్ వచ్చినట్టైంది. ఖమ్మం సభ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు అమిత్‌షా పర్యటన వాయిదా పడగా.. ఈ సారి మాత్రం ఖమ్మం రాక గ్యారెంటీ అనే! చెపప్పవచ్చు. మరోవైపు దేశంలో ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచే ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కాగా తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే 2 సార్లు సర్వే చేయించిన బీజేపీ అధిష్టానం.. మరో విడత సర్వేకు సిద్దమైంది. ఈ సర్వే కోసం 40 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు ఇదే సమావేశంలో అభ్యర్థుల లిస్ట్‌ను సైతం ఫైనల్ చేసే అవకాశం ఉంది.
మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా.. మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీంతో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు పోటీగా తమ పార్టీకి చెందిన నేతలను రంగంలోకి దించాలని చూస్తోంది.
ఎప్పుడైనా ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే కొన్ని రోజుల ముందు భేటీ కావాల్సి ఉంటుంది. కానీ ఈ సారి బీజేపీ అధిష్టానం కొన్ని నెలల ముందుగానే సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే అభ్యర్థులను ఎంత త్వరగా ప్రకటిస్తే.. ప్రచారం చేసుకోవడానికి వారికి అంత ఎక్కువ సమయం ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ సమావేశానికి బీజేపీకి మిత్రపక్షమైన ఎఎన్‌ఎఫ్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మిజోరంలో జరిగిన హింసాత్మక ఘటన వల్ల కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి ఎంఎన్‌ఎఫ్ మద్దతు తెలిపింది. దీంతో మిత్ర పక్షం దూరమైందనే చర్చ జరుగుతోంది.