గత ఏడాది ఆస్ట్రేలియా.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా ఆసీస్ దెబ్బకొట్టింది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల ఛేదనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో కేవలం 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివరికి ఆసిస్.. 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అండర్ 19 స్థాయిలో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. 2012, 2018 ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన కంగారులు ఇప్పుడు బదులు తీర్చుకున్నారు. 2010 తర్వాత ఆసీస్‌కు ఇదే మొదటి అండర్-19 వరల్డ్ కప్ ట్రోపీ కావడం మరో విశేషం. అయితో ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు వచ్చిన మన యువ ఆటగాళ్లు.. తుది పోరులో బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యారు. చివరికి ఆరో టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్లు అయిపోయింది.
Also Read: ఐపీఎల్ బ్యూటీ నవ్వింది.. సోషల్ మీడియా షేక్ అయింది!
బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (3) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ముషీర్ ఖాన్ (22), ఆదర్శ్ సింగ్ (47) నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 37 పరుగులు చేశారు. బీర్డ్‌మన్.. ముషీర్‌ను ఔట్ చేయడంతో భారత మిడిలార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. సెమీస్‌లో అందరినీ ఆకట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9)లు ఫైనల్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక ప్రియాన్షు మోలియా (9) కూడా అదే బాట పట్టాడు.
ఆ తర్వాత వికెట్ కీపర్ అవినాశ్ రావు డకౌట్ అయ్యాడు. ఇక చివరగా 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన భారత్.. 174రన్స్ చేయగలిగిందంటే దానికి కారణం ఆఖర్లో స్పిన్నర్ మురుగన్ అభిషేక్ పోరాటమే. ఇతడు 46 బంతుల్లో 42 పరుగులు చేసి భారత్ తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా స్కోర్ పెంచాడు. ఆసీస్ బౌలర్లలో మహిల్ బీర్డ్‌మన్, మాక్‌మిలన్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Also Read: అతడికి ఇష్టం లేకపోయినా ఆ ముద్ర వేశారు.. బుమ్రాకు కసి, ఆకలి తీరలేదు!