N-Convention Centre: ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్

ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్‌ జోన్‌ పరిధిలో 2 ఎకరాల 18 గంటల్లో ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి పర్మిషన్ లేదన్నారు.

N-Convention Centre: ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
New Update

హైదరాబాద్‌లో చెరువులు, పార్కులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మాదాపూర్‌లోని సినీనటుడు నాగార్జునాకు చెందిన ఎన్‌- కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే దీనిపై నాగార్జున కూడా ఎక్స్‌లో స్పందించారు. కూల్చివేతపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ శనివారం సాయంత్రం వివరణ ఇచ్చారు.

Also Read: తప్పు ఎవరిది? జీహెచ్‌ఎంసీ ఎందుకు అనుమతులిచ్చింది? ఆ నష్టపరిహరం ఎవరిస్తారు?

'' తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలో ఉన్న ఆక్రమణలను హైడ్రా, GHMC, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. అనధికార నిర్మణాల్లో ఎన్‌ కన్వెన్షన్ కూడా ఒకటి. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్‌ జోన్‌ పరిధిలో 2 ఎకరాల 18 గంటల్లో ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి పర్మిషన్ లేదు. దీంతో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (BRS) కింద పర్మిషన్ల కోసం ఎన్‌ కన్వెన్షన్ ప్రయత్నించింది. సంబంధిత అధికారులు కూడా బీఆర్ఎస్‌కు అనుమతి ఇవ్వలేదు.

2014లో తుమ్మడికుంటపై HMDA ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఎన్‌ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నతన్యాయస్థానం కూడా ఆదేశించింది. 2017లో ఎఫ్‌టీఎల్ సర్వే రిపోర్టుపై కేసు పెండింగ్‌లో ఉంది. ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటిదాకా ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌కు సంబంధించిన విషయాల్లో ఎన్‌ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు కూడా కొనసాగించిందని'' రంగనాథ్‌ వివరించారు.

Also Read: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు

మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో చెరువులు ఆక్రమణకు గురికాకూడదనే హైడ్రాను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని.. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేరుగా చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని తెలిపారు. చెరువుల ఆక్రమణపై శాటిలైట్‌ ఫొటోల ద్వారా గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత ఉన్న చెరువుల ఆక్రమణలు గుర్తించి వాటి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ప్రజల ఆస్తులు కాపాడటమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

#telugu-news #akkineni-nagarjuna #hydra #n-convention
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe