High Tension In AP : తలలు పగులుతున్నాయి.. రక్తం పారుతోంది.. చేతులు, కాళ్లు విరిగిపడుతున్నాయి.. కార్లు మనుషులపైకి దూసుకుపోతున్నాయి.. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత కూడా ఏపీ(Andhra Pradesh) లో ఈ రకమైన వాతావరణం కనిపించడం చూసి ఏళ్లు దాటిపోయింది. మునపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. కులాలధిపత్యం కోసం, పార్టీల వర్గపోరులో పైచేయి కోసం జరిగే ఈ రాక్షసాక్రీడలో మాధ్యలో సామాన్యులు చితికిపోతున్నారు. 2024 పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు పశ్చిమబెంగాల్‌ను తలపిస్తున్నాయి. ప్రతీసారి ఎన్నికల(Elections) వేళ గొడవలు సర్వసాధారణమే అయినా 2024 ఎన్నికల తర్వాత మాత్రం హింస పీక్ స్లేజీ దాటినట్టే కనిపిస్తోంది..!
Also Read: పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు
టీడీపీ VS వైసీపీ
టీడీపీ(TDP) నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు. కొంతకాలం క్రితం లోకేశ్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్‌ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిచంద్రగిరి నియోజకవర్గంలో, శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై ఆ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఖాళీ బీరు సీసాలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడికి పాల్పడ్డారు. నాని ఛాతీపై పెద్ద రాయితో దాడి చేశారు. ఈ దాడుల్లో నాని గన్‌మ్యాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మద్దతుదారులు నిరసనలకు దిగడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.
రాళ్ల దాడి
సత్యసాయి జిల్లాలోని తాడిపత్రి వద్ద టీడీపీ, వైసీపీ(YCP) మద్దతుదారులు పరస్పర రాళ్లు విసురుకున్నారు. ఈ రెండు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పారామిలటరీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అటు సాధారణంగానే రణరంగాన్ని తలపించే పల్నాడు పోలింగ్ తర్వాత రక్తం చిమ్ముతోంది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి తన్నుకుంటున్నారు. పరస్పర దాడులు చేసుకుంటున్నారు. మాచర్ల, గురజాలలో ఉద్రికత్త పరిస్థితులు చల్లారలేదు. కొత్తగణేశునిపాడు గ్రామంలో ఇరు వర్గాలు ఇళ్లపై పరస్పర దాడులకు పాల్పడ్డాయి.
Also Read: నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం..ముద్రగడ పై మాస్ ట్రోలింగ్!
ఇటు అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలో గర్భిణిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ధ్వంసం చేసి పరికరాలకు నిప్పు పెట్టారు. ఇలా ఏపీ అంతా గతంలో ఎప్పుడూ లేని విధంగా హింసను చవిచూస్తోంది. ఈ రాజకీయ నెత్తుటి క్రీడలో సామాన్య జనం నలిగిపోతున్నారు..!