హమాస్‌కు అండగా ఉంటాం.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోం: హిజ్బుల్లా చీఫ్

హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా చీఫ్ సయ్యాద్ హసన్ నస్రల్లా తొలిసారిగా బహిరంగ టీవీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడుల్ని ఆయన సమర్థించారు. హమాస్‌కు అండగా ఉంటామని.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోమని వ్యాఖ్యానించారు.

New Update
హమాస్‌కు అండగా ఉంటాం.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోం: హిజ్బుల్లా చీఫ్

Hassan Nasrallah: ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో మిలిటెంట్ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా పార్టీ అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలో (Israel-Hamas War) జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని.. అమెరికా హెచ్చరికల్ని తాను పట్టించుకోమని తేల్చి చెప్పారు. అమెరికా నౌకలు ఇప్పటికే మధ్యదరా సముద్రంలో ఉన్నాయని అయినా తాము భయపడమని.. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. అలాగే అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులను ఆయన సమర్థించారు. ఇప్పటికే తాము పాలస్తీనా కోసం యుద్ధం చేస్తున్నామని..ఇది మరింత విస్తరించవచ్చని తెలిపారు. పాలస్తీనా భూభాగం, పాలస్తీనా ప్రజల కోసమే హమాస్‌ యుద్ధమని.. హమాస్‌కు తాము అండంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రాంతీయ యుద్ధం తలెత్తకుండా ఉండాలని ఎవరైనా భావిస్తే ముందుగా ఇజ్రాయెల్‌ను నిరోధించాలని అన్నారు.

Also Read: భారీ భూకంపం.. 70 మంది మృతి

అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి ఇజ్రాయెల్‌లో భూకంపం సృష్టించిందని... హమాస్ నిర్ణయం సరైనది, ధైర్యంతో కూడుకున్నది, సరైన సమయంలో జరిగిందంటూ వ్యాఖ్యానించారు. హమాస్‌పై చేస్తున్న దాడిలో ఇజ్రాయెల్ ఒక్క మిలిటరీ విజయాన్ని సాధించలేదంటూ విమర్శించారు. చర్చల ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ బంధీలను తిరిగి పొందగలదని తెలిపారు. అలాగే గాజాపై (Gaza) ఇజ్రాయెల్ దాడులు, పౌరుల మరణాలకు అమెరికానే కారణమని ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం చెలరేగిన తర్వాత హెజ్బుల్లా చీఫ్ చేసిన ఈ ప్రసంగం చర్చనీయాంశమవుతోంది. అరబ్బు దేశాల్లోని లక్షలాదిమంది ఈ ప్రసంగాన్ని వీక్షించారు. అయితే నస్రల్లా నేరుగా యుద్ధం ప్రకటిస్తారని చాలామంది ఊహించారు.. కానీ అంతటి తీవ్ర నిర్ణయం గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం సరిహద్దు దాడులకే తాము పరిమితం కాబోమని తన ప్రసంగంలో అమెరికాను హెచ్చరించారు నస్రల్లా. మరోవైపు ఆయన చేసిన ప్రసంగంతో హమాస్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం‌ ప్రాంతీయంగా విస్తరించవచ్చని పలువురు యుద్ధ నిఫుణులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు