Telangana: భద్రాద్రిని ముంచిన వరద

భద్రాద్రిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వర్షపునీరు ముంచెత్తడంతో ఇందులో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఢీఆర్ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కూలీలను రక్షించారు. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

New Update
Telangana: భద్రాద్రిని ముంచిన వరద

Floods And Rain Water: ఒక్కసారిగా పోటెత్తిన వరద, చుట్టుముట్టిన వర్షఫు నీరు, ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న 28 మంది బాధితులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి నాలుగు వైపులా వరద ప్రవాహం చుట్టేడయంతో మధ్యాహ్నం పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు చిక్కుకున్నారు.

పొలం పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించినా ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో 21 మంది ఒకచోట, ఆరుగురు ఇంకోచోట, మరో వ్యక్తి మరొకచోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పశువుల కాపరులు ఆరుగురు చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు వరదల్లో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నారు. రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరిసాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు.

దీనికి తోడు పెద్దవాగు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ఉద్ధృతి ఒకేసారి పోటెత్తింది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో కొన్ని చెరువులు తెగిపోవడంతో ఆ వరద కూడా పెద్దవాగుకు రావడంతో వరద ఉద్ధృతి మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వరద తీవ్రత అంతకంతకూ పెరిగి బాధితులు హాహాకారాలు చేశారు. బాధితులతో పాటు వరదల్లో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిణి అనూష ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం చేరవేశారు.

రుణమాఫీ ప్రారంభ కార్యక్రమంలో ఉండగా మంత్రి తుమ్మలకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎస్తో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి సైతం ఏపీ సీఎస్ నీరబ్ కుమార్తో మాట్లాడి బాధితులను సురక్షితంగా కాపాడాలని అన్నారు. మంత్రులిద్దరూ భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి తక్షణమే చేరుకుని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆది నారాయణ, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు బాధితులు గంటల తరబడి వరదల్లోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మూడు దఫాలుగా మొత్తం 22 మంది బాధితుల్ని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. బచ్చవారిగూడెం సమీపంలో వంతెనపై చిక్కుకున్న మరో ఆరుగురు బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వరద ప్రవాహంలో 20 మేకలు, రెండు ఎద్దులు గల్లంతయ్యాయి. కారు, ఆటో, పది ద్విచక్రవాహనాలు చిక్కుకున్నారు.

Also Read:Jammu-kashmir: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

Advertisment
తాజా కథనాలు