ఏపీలో భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత కేంద్ర హోం సెక్రటరీతో కూడా మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు. 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇతర రాష్ట్రాల నుంచి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపారు. ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్ బృందంలో 25 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. ఒక్కో టీమ్‌కు నాలుగు పవర్ బోట్లు ఉంటాయని.. మొత్తం 40 పవర్ బోట్లను సోమవారం ఉదయం లోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ స్పష్టం చేశారు.
Also Read: ముంచెత్తిన వరద.. RTV ఎక్స్‌క్లూజివ్ డ్రోన్ విజువల్స్
అలాగే వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే సహాయక చర్యల కోసం 6 హెలికాఫ్టర్లను పంపుతున్నామని.. రేపటి నుంచి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయని చెప్పారు. ఇదిలాఉండగా.. ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కలక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. విజవాడలోని బుడమేరు వరద బాధితులను ఆదుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రాంతాలకు ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు వెంటనే తెప్పించాలని ఆదేశించారు. లక్షల మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లను తక్షణమే తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also read: నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు!