దేశ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమయంలో ఉగ్రవాదులు దాడులు చేస్తారో ఊహించని పరిస్థితి ఉంటుంది. అయితే మనదేశ సరిహద్దులో ఉగ్రవాదులను హతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన ఉత్తర కశ్మీర్‌లోని కుర్వారా అనే జిల్లాలో దేశ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చేశాయి. అయితే ఆ దాడిలో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే అనుమానంతో వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగింది సైన్యం.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే కప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తొలుత కాల్పులు జరిగాయి. మచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు.
Also Read: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు
అయితే ఈ ఎన్‌కౌంటర్లో ఇప్పటిదాకా 5గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ఆపరేషన్ ఆర్మీ, పోలీసులతో కలిసి కొనసాగుతోందని.. డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. వాస్తవానికి ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు చొరబాటు కోసం పదే పదే ప్రయత్నాలు చేస్తుంటారు. నియంత్రణ రేఖ వెంట చూసుకుంటే దాదాపు 16 వరకు లాంచింగ్ ప్యాడ్‌లు తయారుచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీ, పోలీసులు సరిహద్దు ప్రాంతంలో పటిష్ఠమైన నిఘా వేసింది. ఇదిలా ఉండగా.. శని, ఆదివారాల్లో కూడా పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను కూడా సైన్యం కాల్చేసింది.