బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే శనివారం రాష్ట్ర సర్కార్.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉభయ సభలనుద్దేశించి.. గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులు దూరంగా ఉన్నారు.
Also Read: ఎంపీ అర్వింద్‌కు టికెట్ ఇస్తే చచ్చిపోతా.. పెట్రోల్ పోసుకొని బీజేపీ నేత నిరసన
ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
ఇక రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.. అలాగే శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అయితే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత.. కేసీఆర్ తన ఇంట్లో జారిపడి గాయపడ్డ విషయం తెలిసిందే. ఆయన తుంటి ఎముక విరగడంతో.. ఆస్పత్రిలో శస్త్రచికిత్స తీసుకొని కోలుకున్నారు. ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఏం మాట్లాడుతారో
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఇప్పటికే కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇలా ప్రతిపక్ష నాయకుడి హోదాలో మొదటిసారి అసెంబ్లీ రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మరి కేసీఆర్ అడుగుపెట్టాక ఏం జరుగుతుందో చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్…సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!