Donald Trump: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా

కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్‌ కోర్టు 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. ఆయన మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆఫీసర్‌ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా నిషేధించింది.

Donald Trump: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా
New Update

Doanld Trump: రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని పోటీ పడుతున్న.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసుల్లో ట్రంప్‌ ఇరుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా న్యూయార్క్‌ కోర్ట్‌ మరో షాక్ ఇచ్చింది. కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. అయితే ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువల కంటే ఎక్కువగా చూపి.. బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read: నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..

354 మిలియన్ డాలర్ల ఫైన్ 

కొన్నేళ్లపాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా తీసుకున్నారనే దానిపై కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ దీనిపై దావా వేయగా.. న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందులో ట్రంప్‌పై వచ్చిన అభియోగాలు రుజువు కావడంతో.. 354 మిలియన్ డాలర్ల పెనాల్టీ విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. అంతేకాదు.. మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆయన ఆఫీసర్‌ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా కూడా నిషేధం విధించింది న్యాయస్థానం.

మేం అప్పీల్‌కు వెళ్తాం

ఇది సివిల్‌ కేసు కావడం వల్ల జైలు శిక్ష వేయడం లేదని న్యాయమూర్తి తెలిపారు. అయితే కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్‌ తరఫున న్యాయవాదులు తెలిపారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ కొంతకాలంగా బిజీగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకు కేసుల ఇబ్బందులు తప్పడం లేదు.

గతంలో కూడా భారీ జరిమానాలు 

ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన పరువునష్టం కేసులో కూడా ట్రంప్‌కు భారీ జరిమాన పడింది. ఈ కేసులో బాధితురాలైన అమెరికన్ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్ (80)కు 83.3 మిలియన్ డాలర్లు(రూ.692 కోట్లు) అదనంగా ట్రంప్‌ చెల్లించాలని మాన్‌హటన్ ఫెడరల్ కోర్ట్‌ ఆదేశించింది. మరో విషయం ఏంటంటే ఇదే కేసులో అంతకుముందు కూడా ఆయనపై 5 మిలియన్‌ డాలర్ల జరిమానా పడింది. మరోవైపు 2022లో పన్ను చెల్లింపులకు సంబంధించిన కేసులో కూడా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు 1.6 మిలియన్‌ డాలర్ల పెనాల్టీ విధించారు.

Also Read: ఎలాన్ మస్క్‌ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?

#usa #telugu-news #trump #donald-trump
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe