VV Vinayak To Contest As MP: మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో (Parliament Elections) పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో ఎంపీగా పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వీవీ వినాయక్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు!
పవన్ కు చెక్ పెట్టేందుకు..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ ఇటీవల మూడు రోజులు కాకినాడలో (Kakinada) పర్యటించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మరోసారి కూడా పవన్ కాకినాడలో పర్యటించన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.
అయితే.. పొత్తులో ఉన్న జనసేన, టీడీపీ పార్టీలను (Janasena - TDP) చెక్ పెట్టేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాకినాడలో కాపు సమాజం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ ఓట్లను తమకు పడేలా చేసుకునేందుకు వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ను ఎంపీగా పోటీలో నిలబెట్టనుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సీఎం జగన్ తో వీవీ వినాయక్ భేటీ..
రేపు లేదా సోమవారం రోజున సీఎం జగన్ తో డైరెక్టర్ వీవీ వినాయక్ భేటీ కానున్నారని తెలుస్తోంది. కాకినాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో వీవీ వినాయక్ ను దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు జరుగుతున్న కసరత్తుల్లో భాగంగా వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. సంక్రాంతిలోపే ఇంఛార్జిగా ప్రకటించి ప్రజల్లోకి పంపాలని వైసీపీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ALSO READ: YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ?
ఎమ్మెల్యేలుగా ఎంపీలు పోటీ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముగ్గురు ఎంపీలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ రాజమండ్రి సిటీ.. కాకినాడ ఎంపీ వంగా గీతా పిఠాపురం నియోజకవర్గాల ఇంఛార్జిలుగా వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో జాబితాలో తన పేరు వస్తుందంటూ చింతా అనురాధ ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.