అయ్యో దేవుడా.. ప్రాణం తీసిన ట్రాఫిక్!

ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్థాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.

New Update
Maharashtra Woman

ముంబైకి సమీపంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కారణంగా ఓ మహిళ అర్థాయుషుతోనే ప్రాణాన్ని విడిచింది. నేషనల్ హైవే 48పై భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఆ వాహనాల మధ్య చిక్కుకుపోయిన అంబులెన్స్‌లో 49 ఏళ్ల మహిళ మరణించింది. టైంకు హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. 

వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్‌లోని ఒక గ్రామానికి చెందిన ఛాయా పూరవ్ అనే మహిళపై ఇంటి పక్కనున్న ఓ చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ఛాయా పూరవ్‌ను  స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఆమెను ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో ఆమె భర్త కౌశిక్ పూరవ్ ఆమెను అంబులెన్స్‌లో ముంబైకి తీసుకెళ్లడానికి బయలుదేరారు.

పాల్ఘర్ నుండి ముంబైకి సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా అక్కడికి వెళ్లాలంటే 2 గంటల సమయం పడుతుంది. కానీ NH-48పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందులో చిక్కుకున్న అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. 4 గంటలకు పైగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. ఆ టైంలో ఛాయా పూరవ్ తీవ్ర నరకయాతన అనుభవించింది. ట్రాఫిక్ జామ్ కారణంగా రోడ్డుపై ఏర్పడిన గుంతలు, ఒడిదుడుకుల కారణంగా ఆమె నొప్పి మరింత పెరిగింది. ఆమె అంబులెన్స్‌లోనే అరుస్తూ, ఏడుస్తూ కన్నుమూసిందని ఆమె భర్త కౌశిక్ కన్నీళ్లతో తెలిపారు.

గంటల తరబడి ట్రాఫిక్‌లో బాధతో ఛాయా స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను అక్కడికి సమీపంలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ముంబై ఆసుపత్రికి అరగంట ముందు చేరుకున్నా తన భార్య ప్రాణాలను కాపాడుకునేవాడినని కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు