Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు

ఉత్తరకాశీ జిల్లా ధరాళి గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైయ్యారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది.

New Update
Uttarakhand floods

ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాళి గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైనట్లు వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ పెను విపత్తులో పలు ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 50 మందికి పైగా గల్లంతైనట్లు స్థానికులు, అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం కూడా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

గల్లంతైన వారిలో 20 మంది కేరళ వాసులైనప్పటికీ మహారాష్ట్రలో నివసిస్తున్నారని, మిగిలిన ఎనిమిది మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారని వారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. వారు హరిద్వార్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 10 రోజులు కాశీ టూర్‌కు వెళ్లారు. చివరిసారిగా వారు మంగళవారం ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరుతున్నట్లు చెప్పారని, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్లు కూడా పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రక్షణ, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నప్పటికీ ఇప్పటివరకు 150 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ విపత్తులో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పరిస్థితిని సమీక్షించి, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు