/rtv/media/media_files/2025/08/23/gurukul-school-staff-2025-08-23-20-18-52.jpg)
Gurukul school staff
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఒక టీచర్ చేసిన నిర్వాకం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. పైఅధికారిపై ఉన్న కక్షతో పాఠశాల మంచినీటిలో పురుగుల మందు కలిపాడు ఓ ఉద్యోగి. ఈ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న సెమీ-రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల ఉపాధ్యాయుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక అధికారిపై కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఉపాధ్యాయుడు విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపాడు. అయితే, పాఠశాల సిబ్బంది ఈ విషయం గమనించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కలవరపెట్టిస్తున్న గురుకుల పాఠశాలల నిర్వహణ. భూపాలపల్లి అర్బన్ ప్రిన్సిపాల్ మీద కోపంతో సైన్స్ టీచర్ మంచి నీటి ట్యాంకు లో విషం కలిపారని వార్తలొస్తున్నాయి!
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 23, 2025
ఇంతకన్నా ఘోరం ఉంటదా?
ఇది పర్యవేక్షణ లోపం కాకపోతే మరేంది @revanth_anumula గారు? pic.twitter.com/RWa3aPW8ys
అప్పటికే 11 మంది విద్యార్థులు ఆ నీటిని తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీసులు దర్యాప్తు చేయగా, ప్రిన్సిపాల్ వెంకటనర్సయ్యపై ఉన్న కోపంతో రాజేందర్ అనే ఉపాధ్యాయుడు ఈ పని చేసినట్లు తేలింది. ఈ దుశ్చర్యకు మరో ఇద్దరు టీచర్లు, ఒక వంటమనిషి కూడా సహకరించినట్లు తేలింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు, కేవలం వ్యక్తిగత కక్షల కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళనలను పెంచింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.