Vaishno Devi Yatra: విషాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య (VIDEOS)

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్‌ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా బుధవారం వెల్లడించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

భారీ వర్షాలతో జమ్మూకశ్మీర్‌ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి పెరిగింది. అలాగే పదుల కొద్దీ యాత్రీకులు గాయాలపాలైయ్యారు. చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా బుధవారం వెల్లడించారు. అలాగే ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు మూసివేశారు. అర్ధకుమారి ప్రాంతానికి సమీపంలో మంగళవారం సాయంత్రం నుంచి కుంభవృష్టి సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయక చర్యల గురించి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

భక్తుల భద్రత దృష్ట్యా, మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ప్రకటించింది. వైష్ణోదేవి యాత్రకు ఉపయోగించే బ్యాటరీ కార్లు, హెలికాప్టర్ సర్వీసులను కూడా నిలిపివేశారు. హిమకోటి ట్రెక్ మార్గంలో యాత్ర ఇప్పటికే నిలిచిపోగా, ఇప్పుడు పాత మార్గంలో కూడా యాత్రను నిలిపివేశారు. దీనితో పాటు కథువా, దోడా, రాంబన్ సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో మేఘాల విస్ఫోటనం కారణంగా నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు