Cyber ​​Crime: వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే.. అకౌంట్‌లో రూ.2 లక్షలు స్వాహా

ట్రెండ్‌కు తగ్గట్లు మనమే కాదు సైబర్ నేరగాళ్లు కూడా మారుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేశాడు. ఖతం, అకౌంట్లో ఉన్న రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నారు.

New Update
Wedding Invite On WhatsApp

ట్రెండ్‌కు తగ్గట్లు మనమే కాదు సైబర్ నేరగాళ్లు కూడా మారుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొత్తకొత్త ట్రిక్స్‌లో కోట్లు కొట్టేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌లో వచ్చిన వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేశాడు. ఖతం, అకౌంట్లో ఉన్న రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఈ కొత్త తరహా మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని హింగోలిలో చోటు చేసుకుంది. ఆగస్టు 30న తమ వివాహమని, తప్పకుండా హాజరు కావాలంటూ గుర్తుతెలియని నంబర్ నుంచి ఆ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ వచ్చింది. దానితో పాటు పెళ్లి పత్రిక ఉందని చెబుతూ ఒక ఫైల్‌ను యాడ్ చేశాడు ఆ మాయలోడు. అది PDF ఫైల్ అని భావించిన బాధితుడు దానిని తెరిచాడు. కానీ అది PDF కాదు, ఒక ప్రమాదకరమైన 'apk' (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్. ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే, ఆ ఉద్యోగి ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది.

ఆ apk ఫైల్ బాధితుడి ఫోన్‌లో ఉన్న అన్ని వివరాలను సేకరించింది. ఇందులో ఫోటోలు, కాంటాక్ట్స్, ముఖ్యంగా బ్యాంక్ యాప్‌ల వివరాలు ఉన్నాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే సైబర్ కేటుగాళ్లు బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.90 లక్షలను వేరే ఖాతాకు బదిలీ చేశారు. ఈ మోసాన్ని గుర్తించిన వెంటనే బాధితుడు హింగోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ తరహా 'వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్' గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎక్కువైందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆకర్షణీయమైన సందేశాలతో నకిలీ ఏపీకే ఫైళ్లను పంపుతారు. ఈ ఫైళ్లు చూడటానికి పీడీఎఫ్ లేదా ఇమేజ్ ఫైల్స్ లాగా కనిపిస్తాయి. కానీ వాటిని క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయగానే ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. తద్వారా ఫోన్‌లో ఉన్న సున్నితమైన సమాచారాన్ని దొంగిలించి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు.

అందుకే గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఏ ఫైల్‌ను కూడా ఓపెన్ చేయవద్దని, ముఖ్యంగా '.apk' ఎక్స్‌టెన్షన్‌తో ఉన్న ఫైల్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఫైల్ వస్తే, పంపినవారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం మంచిది. సైబర్ నేరాల బారిన పడితే, వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు