మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో అనూహ్యంగా బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈ విజయంపై స్పందించిన ప్రధాని.. ప్రజలు, అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని అన్నారు. దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయకూడదని కాంగ్రెస్‌కు హెచ్చరిస్తున్నానని వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు 2024లో జరుగనున్న ఎన్నికల విజయానికి బాటలు వేసిందని పేర్కొన్నారు. అయితే తాజాగా శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంటుకు వచ్చిన ప్రధాని మరోసారి ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ స్పందించారు. ప్రజలు నెగిటివిటీని తిరస్కరించారంటూ విమర్శించారు. ఈసారి శీతాకాలం కాస్త ఆలస్యంగా అయ్యిందని.. రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగిందన్నారు. ఆదివారం వచ్చిన ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక అనే అనే పదమే ఉండదని నిరుపించబడిందని పేర్కొన్నారు.
Also Read: డిప్యూటీ సీఎం పదవి రేసులో ఆరుగురు అగ్ర నేతలు.. ఎవరో తెలుసా..?
ఫలితాలు చూసిన తర్వాత విపక్ష నేతలకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమితో విసుగు చెంది ఆ నిరాశను పార్లమెంట్‌లో చూపించుకోవాలనుకునే ఆలోచనలు మానాలంటూ హితువు పలికారు. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగిటివిటీని పక్కకుపెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. సానుకూల ధృక్పథంలో ముందకెళ్తేనే.. ఈ దేశం వారిపై తమ అభిప్రాయాన్ని మార్చుకుంటుందని వ్యాఖ్యానించారు. వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారికి ఓ సలహా ఇస్తున్నానని.. ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్బుతంగా ఉంటుందని అన్నారు. మీ ఓటమి అసహనాన్ని పార్లమెంటులో ప్రదర్శించొద్దని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు (సోమవారం) నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
Also Read: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం