1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధామనంతి ఇందిరాగాంధీ. 49 ఏళ్ల వయసులోనే కీలక బాధ్యతలు చేపట్టిన ఆమె.. సుమారు 16 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. ఈరోజు ఆమె 106వ జయంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇందిరా వెనుకాడేవారు కాదు. తన హయాంలో వ్యవసాయం, అంతరిక్షం, అణుశక్తి ఇలా రంగాల్లో పురోగతి సాధించేందుకు కృషి చేశారు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు విపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఇందిరా గాంధీ ధైర్యంగా ముందుకెళ్లేవారు. ముఖ్యంగా తూర్పు పాకిస్థాన్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ విముక్తికి ఆమె తీసుకున్న నిర్ణయానికి మాజీ ప్రధాని అటల్ బీహారీ వాడ్‌పేయి ఇందిరాను దుర్గాదేవిగా అభివర్ణించారు.
1966 జనవరిలో ఇందిరా గాంధీ మొదటిసారిగా ప్రధాని పదవి చేపట్టాక ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిపాలైంది. దీంతో దేశ ఆర్థికవ్యవస్థ క్షీణించింపోయింది. ఈ ప్రభావానికి మూడో పంచవర్ష ప్రణాళికను కూడా ఆపివేయాల్సి వచ్చింది. దీంతో ఇందిరా వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. దేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైన కొఠారీ కమిషన్ సిఫార్సలను అమల్లోకి తీసుకొచ్చి ఐరన్ లేడీగా ఎదిగిపోయారు.1967 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇందిరాగాంధీ విజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యారు.1968లో హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడిని అందించే గోధుమ, వరి వంగడాలను సృష్టించి, భవిష్యత్ తరాలకు ఆహార కొరత రాకుండా ఆమె కృషి చేశారు. అలాగే 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
Also Read: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
1970లో శ్వేత విప్లవం ద్వారా పాడిపరిశ్రమను వృద్ధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇళ్లు లేని పేదల కోసం పక్కా ఇల్లు నిర్మాణం, ఉపాధి కల్పన, భూమి పంపిణీ వంటివి ప్రారంభించారు ఇందిరా. దళిత, గిరిజన, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు. అంతేకాదు అంతరిక్షంలోకి తొలి భారతీయుడిని పంపారు. అక్కడికి వెళ్లిన వ్యోమగామి రాకేశ్ శర్మతో కూడా ఆమె మాట్లాడారు. ఇక 1972 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదంతో మూడోసారి అధికార బాధ్యతలు తీసుకున్నారు.1974లో పోఖ్రాన్ లో అణుశక్తి పరీక్షలు జరిపి అగ్రదేశాలను ఇండియా వైపు చూసేలా చేశారు. ఆ తర్వాత 1976లో దేశ రాజ్యాంగ పీఠికలో లౌకిక, సామ్యవాద పదాలను చేర్చారు.
1975లో దేశంలో ఆ కాలం నాటి రాజకీయ కుట్రలను తిప్పికొట్టేందుకు 9 నెలల పాటు ఆమె ఎమర్జెన్సీని విధించారు. దీంతో ఆమె పాలన తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది. ఈ నిర్ణయం ఆమెను అప్రతిష్ట పాలుజేసింది. చివరికి 1977 ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. కానీ 1980లో మరోసారి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా కామన్వెల్త్ దేశాల సదస్సు, ఢిల్లీలో ఆసియన్ గేమ్స్ సైతం నిర్వహించారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇందిరాగాంధీ సేవలను, చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలైతే ఆమెను ఇప్పటికీ ప్రేమగా ‘ఇందిరమ్మ’ అని పిలుస్తుంటారు.