తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుంచీ వరుసపెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే కాక ఇళ్ళ కేటాయింపు, రైతు బంధు పంపిణీ లాంటి విషయాల మీద కూడా ఫోకస్ పెట్టింది. వీటి మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణ చేయాలని చెప్పారు. ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ..రోడ్లు, భవనాల శాఖలో భాగంగా ఉంది. దీన్ని వేరేగా ఒక శాఖ చేయాలా అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీని కోసం ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారని సీఎం కార్యాలయం చెప్పింది. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.
Also Read:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్
మరోవైపు తెలంగాణలో రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. సోమవారం నుంచి నిధుల జమ మొదలైంది. మొదటగా ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేస్తున్నారు. ఇప్పటిదాకా 22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధును జమ చేస్తున్నామని తెలిపింది. ఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్ విడుదల చేస్తామని చెప్పింది. అది వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు ఉంటుందని వివరించింది.
ఇక ధరణి పోర్టల్‌పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసే ఆలోచనలో ఉందని సమాచారం. ధరణిలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అందుకే దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని తెలిపింది.