అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కలిసి పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. కానీ ఆప్ ఈ ఎన్నికల్లో తమకు 20 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది.
మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) మీటింగ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. హర్యానాలో బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌ను వినియోగించుకొని ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనిపించడంతోనే ఆప్ 20 సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ మాత్రం ఇందుకు వెనకాడుతున్నట్లు సమాచారం.
Also Read: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే!
అయితే ఈ సవాళ్లు ఉన్నప్పటికీ కూడా విపక్ష నేత రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకత్వం ఆప్ పొత్తుపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. ఆప్‌కు సీట్లు కేటాయించే విషయాన్ని పరిగణలోకి తీసుకోని ఒక ప్రతిపాదనను తీసుకురావాలని కాంగ్రెస్ పెద్దలు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. గతంలో ఢిల్లీలో కూడా కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కాంగ్రెస్.. ఆప్ డిమాండ్‌కు పూర్తిగా కట్టుబడి ఉండదని తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా.. ఆప్ డిమాండ్ చేస్తున్న 20 సీట్ల నుంచి రెండు లేదా మూడు స్థానాలు తగ్గించే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాది లాంటి ఇతర పార్టీల డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆప్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని వస్తున్న వార్తలను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్వాగతించారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇదిలాఉండగా.. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా ఎన్నికలు అక్టోబర్ 5 న జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..