CM Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిచ్చింది అంటూ విమర్శించారు. ' 2018లో పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Also Read: జగన్ పై సీఐడీ విచారణ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు. గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి అండగా బీఆర్‌ఎస్ నిలబడింది. అన్నింట్లో మద్దతు పలికి కేంద్రంపై పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆరెస్ వ్యవహరించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి మద్దతిచ్చారు.
సాగు చట్టాల విషయంలోనూ బీఆర్‌ఎస్.. బీజేపీకి అండగా నిలిచింది. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారు. అదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లడటానికి కాదు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆరెస్ పదేళ్ల పాలనే. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండిగ్ వాళ్లు పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు. గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా ?. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నానంటూ' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర.. కిలో ఎంతంటే!