2023తో పోలిస్తే 2024లో టాలీవుడ్‌లో సినిమాల సందడి మరింత పెరిగింది. థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అనూహ్యంగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ విజయం సాధించి ఆశ్చర్యాన్ని కలిగించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు డిజాస్టర్‌గా మిగిలిపోయాయి.
సమ్మర్ సీజన్‌లో పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేయకపోవడంతో, ఈ ఖాళీని చిన్న, మధ్యస్థాయి హీరోల చిత్రాలు బాగా వినియోగించుకున్నాయి. అయితే, ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్ క్రికెట్ వంటి కారణాల వల్ల ప్రజలు థియేటర్లకు పెద్దగా ఆసక్తి చూపకపోయారు. టాక్ బాగున్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. మరో రెండు రోజుల్లో 2025 కి వెల్ కమ్ చెప్పబోతున్నాం కాబట్టి 2024 లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం..
హనుమాన్
అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన 'హనుమాన్' ఏకంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరో నటించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఇద్దరికీ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
గుంటూరు కారం
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటీ ఫుల్ హీరోయిన్ శ్రీలీలా జంటగా నటించిన 'గుంటూరు కారం'.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే మహేశ్ బాబు స్టార్ డం తో ఈ సినిమాని గట్టెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
నా సామి రంగా
నాగార్జున లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. దానికి పండగ సీజన్ లో రిలీజ్ చేయడంతో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అన్ని ఏరియాలో గ్రీక్ ఈవెన్ మార్క్ అందుకుని.. నాగార్జునకు ఓ మోస్తరు కం బ్యాక్ ఇచ్చింది.
గామి
విశ్వక్ సేన్ ఫస్ట్ టైం అఘోర పాత్రలో నటించిన 'గామి' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
టిల్లు స్క్వేర్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మార్చ్ లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల వరకూ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కల్కి 2898AD
నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో మహాభారతం & ఫ్యూచర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'కల్కి 2898AD' బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ నెలలో రిలీజన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి 2024 లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కమిటీ కుర్రాళ్ళు
నిహారిక కొణిదెల నిర్మాతగా అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటూ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆగస్టు నెలలో విడుదలై రూ.20 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే నెలలో విడుదలైన మరో మూవీ 'ఆయ్' కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది.
సరిపోదా శనివారం
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన 'సరిపోదా శనివారం' ఆగస్టు చివర్లో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ హిట్ అందుకుంది.
మత్తు వదలరా 2
శ్రీ సింహ, సత్య, ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఆడియన్స్ ను బాగా అలరించింది. 'మత్తు వదలరా' మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
దేవర
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'దేవర' సెప్టెంబర్ చివర్లో విడుదలైంది. సినిమాలో సాంగ్స్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.
క
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' పెద్దగా అంచనాలు లేకుండా ఆక్టోబర్ లో రిలీజయింది. సరికొత్త కాన్సప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో కెరీర్ లోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్మాల్ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
లక్కీ భాస్కర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - వెంకీ అట్లూరి కాంబోలో దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా పలు థియేటర్స్ లో 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది.
పుష్ప2
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' డిసెంబర్ మొదటి వారంలో రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుకుమార్ టేకింగ్, బన్నీ ఫెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ భారీ ప్రేక్షకాదరణ అందుకున్న ఈ సినిమా ఇప్పటిదాకా రూ.1700 కోట్లు కొల్లగొట్టింది.