శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. రూ.60 కోట్లు చెల్లించాలని ఆదేశాలు

బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ఆమెకు అనుమతి నిరాకరించింది. రూ.60 కోట్లు చెల్లించాలని చెప్పింది. శిల్పశెట్టి, ఆమె భర్త ఓ వ్యాపారవేత్తని రూ.60 కోట్ల మోసం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు.

New Update
Shilpa Shetty

బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పా శెట్టికి  బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ఆమెకు అనుమతి నిరాకరించింది. ముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం చేసిన చీటింగ్ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారిస్తోంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఇటీవలే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్‌, లేదా దర్యాప్తు అధికారుల అనుమతి తప్పనిసరి.

ఈ నేపథ్యంలో శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ శిల్పా శెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్‌ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్‌ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శిల్పా శెట్టికి షాక్‌ ఇచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. విదేశీ ప్రయాణ అనుమతి కోరేముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 14వ తేదీకి వాయిదా వేసింది. రూ.60 కోట్ల మేరకు మోసం కేసులో శిల్పా శెట్టిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం రెండు రోజుల క్రితం విచారించింది. సోమవారం శిల్పా శెట్టి ఇంటికి వెళ్లిన అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటలపాటూ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా శిల్పా శెట్టి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విచారణ సందర్భంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విచారణ సందర్భంగా పలు పత్రాలను నటి అందజేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో గతనెల రాజ్‌ కుంద్రాను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 5 గంటల పాటూ ఆయన్ని విచారించిన పోలీసులు.. ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్‌ కొఠారీ ఇటీవలే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కంపెనీ 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి రూపంలో రూ.60.4 కోట్లను ఈ దంపతులకు ఇచ్చిందని తెలిపారు. ఈ సొమ్మును వీరు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులోని బెస్ట్‌ డీల్‌ టీవీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రస్తుతం మూతపడింది.

Advertisment
తాజా కథనాలు