CM Revanth Reddy : కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కోసం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
అందుకు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు... చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాదక ద్రవ్యాల (Drugs) వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. అయితే, మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడంలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏదైనా కొత్త సినిమా రిలీజైతే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోల కోసం ప్రభుత్వం వద్దకు వస్తున్నారే కానీ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలుగు నటులు సామాజిక బాధ్యతను సరిగా నెరవేర్చడంలేదని తమ ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
'ఇప్పుడు నేను మా అధికారులకు సూచన చేస్తున్నా... టికెట్ల ధరలు పెంచాలని ఎవరైనా సినిమా వాళ్లు జీవోల కోసం వస్తే, వాళ్లు తప్పనిసరిగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేలా ముందస్తు నిబందన విధించండి' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం తమ ట్విటర్ లో ట్వీట్ చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "థాంక్యూ రేవంత్ రెడ్డి గారూ... ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను" అంటూ స్పందించారు.
Also read: హైదరాబాద్ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!