Will Chandrababu Join in INDIA Alliance: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా మలుపులు తిరుగుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను కక్షపూరితంగా అరెస్ట్ చేయిస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Benarjee), సమాజ్ వాద్ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అయితే వీరంతా విపక్ష ఇండియా కూటమి సభ్యులే కావడం విశేషం.
బీజేపీపై గుర్రుగా టీడీపీ నేతలు..
2019 ఎన్నికలకు ముందు దాకా ఎన్డీయేలో ఉన్న టీడీపీ (TDP) ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీతో పోరాటం చేస్తూ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, మోదీతో సానుకూలంగా మెలుగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్కీల్ డెవలెప్మెంట్ కేసు (Skill Development Case)లో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం.. ఈ అరెస్టుపై బీజేపీ నేతలు స్పందించకపోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నో అవినీతి కేసులు ఉండి బెయిల్‌పై మీద ఉన్న జగన్‌కు కేంద్రం అండ లేకుండా బాబు లాంటి సీనియర్ నాయకుడిని అరెస్టు చేసే ధైర్యం లేదని సైకిల్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏకు దూరంగా ఉండే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇండియా కూటమి వైపు అడుగులు..?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని దేశంలోని విపక్షాలన్ని ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే మూడు సార్లు సమావేశాలు నిర్వహించి ఎన్నికల ఎజెండా కూడా రూపొందించాయి. అలాగే ఎన్డీయే కూడా తన మిత్రపక్షాలతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు కూటమిలలో టీడీపీ, వైసీపీ లేవు. వైసీపీ ఏమో బయట నుంచి ఎన్డీఏకి మద్దతు ఇస్తుంటే.. టీడీపీ ఏమో ఎన్డీఏతో చేతులు కలిపేందుకు తహతహలాడుతోంది. ఇప్పుడు అరెస్టు అయిన నేపథ్యంలో ఇండియా కూటమి వైపు చంద్రబాబు అడుగులు వేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం మద్దతు కోసం ప్రయత్నిస్తూ వచ్చారు..
ఎందుకంటే 2019 ఎన్నికల్లో విపక్షాలతో కలిసి మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు విపక్షాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే ఇటీవల ఇండియా కూటమి సమావేశాలకు సైతం చంద్రబాబును ఆహ్వానించలేదు. అయితే తాజాగా మారిన కీలక పరిణామాలతో బాబు ఇండియా కూటమిలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఇండియా కూటమిలోని సభ్యులైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాద్ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించడంతో వారి వైపు మొగ్గు చూపొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య లాంటివి. రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి వస్తేనే పార్టీకి జవసత్వాలు వస్తాయి. లేదంటే ఆ పార్టీ మరింత అథపాతళంలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇప్పటిదాకా కేంద్రం మద్దతు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తూ వచ్చారు.
బాబును తమ వైపు తిప్పుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నాలు..
అయితే ఇప్పుడు జగన్ (Jagan)కు వెనక నుంచి మద్దతు ఇచ్చి తనను అరెస్ట్ చేయడానికి కేంద్ర పెద్దలు సహకరించారని చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు అనుమానిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో చేరి ఎన్డీఏ, వైసీపీని దెబ్బ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఇండియా కూటమి పార్టీలు కూడా సీనియర్ నాయకుడైన చంద్రబాబును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఇండియా కూటమిలో చంద్రబాబు చేరితే మాత్రం విపక్షాల ఐక్యతకు మరింత బలం చేకూరినట్లు అవుతుంది. మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా