ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్‌.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!

చలో రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.

New Update
ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్‌.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!

TSRTC Chalo Raj Bhavan: టీఎస్‌ఆర్టీసీ (TS RTC) కార్మికులు చెప్పిందే చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును గవర్నర్‌ తమిళిసై (Tamilisai) ఇప్పటివరకు ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. ముందుగానే చెప్పినట్టుగా రాజ్‌భవన్‌ (Raj Bhavan) వైపు అడుగులేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు నడపడం బంద్‌ చేస్తామని చెప్పిన ఆర్టీసీ కార్మికులు.. ఆ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో బంద్‌ని కొనసాగిస్తుండగా.. మరోవైపు చలో రాజ్‌భవన్‌కి (Chalo Raj Bhavan) ర్యాలీగా బయలు దేరారు. రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. నగరంలోని వివిధ డిపోల నుంచి భారీగా తరలివస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. విలీన బిల్లు విషయంలో గవర్నర్‌ సందేహాలపై కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.

మరోవైపు రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రణాళిక వేసుకున్న ఆర్టీసీ కార్మికులను ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్లాన్ గీసుకున్నారు. రాజ్‌భవన్‌ వరకు కార్మికులను వెళ్లనివ్వకుండా చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అక్కడికి కార్మికులు చేరితే పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే భారీ ఎత్తున భద్రత పెంచారు. పోలీసుల భద్రతను లెక్క చేయకుండా పీవీ మార్గ్‌కి ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకుంటున్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ వెంటనే సంతకం పెట్టాలంటూ ప్లకార్డ్‌లతో నిరసన తెలుపుతున్నారు. ఇక జై తెలంగాణ నినాదాలతో నెక్లెస్ రోడ్డు ప్రాంతం దద్దరిల్లుతోంది. అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం.. ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ బస్సుల బంద్‌ కొనసాగుతోంది.

2019 లో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె నాడు దేశవ్యాప్తంగా చాలా రోజుల పాటు టాప్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వచ్చింది. గతాన్ని తలపించేలా ఆర్టీసీ కార్మికులు మరోసారి ఉద్యమం బాట పడతారన్న టెన్షన్ కనిపిస్తోంది. రాజ్‌భవన్‌ ముట్టడి అంటే చిన్న విషయం కాదు. అందుకే పోలీసులు కూడా ఈ నిరసనలను ఆపాలని చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది. అటు రాజకీయాలకు అతీతంగా అందరూ తమకు మద్దతుగా నిలవాలని ఓవైపు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే  మాటల మంటలు రేగుతున్నాయి. గవర్నర్ అందుబాటులో లేరని ముందే చెప్పారని.. కావాలనే బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ప్రజల సమస్యలు పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు PRC లు బాకీ ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను బలవంతంగా బస్సులో ఎక్కించి రాజ్‌భవన్ పంపుతున్నారని ఆరోపిస్తున్నారు ఈటల. ఆర్టీసీ కార్మికులు ఎంతో చైతన్య వంతులని.. వారిని తప్పు దోవ పట్టిస్తున్నారన్న విషయం వారికి కూడా తెలుస్తుందన్నారు ఈటల.

Also Read: బిగ్‌ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్‌ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు

Advertisment
తాజా కథనాలు