MP Arvind: కేంద్రం 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తోంది

సీఎం కేసీఆర్‌పై ఎంపీ ధర్మపూరి అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలుకాకుండా చేశారని ఎంపీ విమర్శించారు.

New Update
MP Arvind: కేంద్రం 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తోంది

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేదలకు 5 కోట్ల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తెలిపారు. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇండ్లను నిర్మించామన్న ఆయన.. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరకు అవి కూడా పూర్తవుతాయని అర్వింద్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కోట్ల మంది లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందుతున్నాయని ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు.

మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇళ్ల నిర్మాణంలో విఫలమయ్యారని ఆరోపించారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానని ఆశ చూపిన కేసీఆర్‌.. ఇదిగో ఇళ్లు.. అదిగో ఇళ్లు అంటూ వారిని మభ్య పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు కాకుండా కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 14 శాతం ఓటర్లు ఉన్న ముస్లింలకు కేసీఆర్‌ ముస్లింబంధు ఎందుకు ఇవ్వడంలేదని ఎంపీ ప్రశ్నించారు.

దళితులకు 10 లక్షలు ఇస్తున్న కేసీఆర్‌.. ముస్లింలకు లక్ష రూపాయలే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ముస్లింలలో కూడా పేదలు ఉంటారని ఎంపీ తెలిపారు. సీఎం ముస్లింలను మోసం చేస్తున్నాడని అర్వింద్‌ ఆరోపించారు. ముస్లిం సోదరులు బీజేపీకి ఓటు వేయకుంటే నోటాకైనా వేయాలి కానీ బీఆర్‌ఎస్‌కు మాత్రం వెయకూడదని సూచించారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో ముస్లిం సోదరులకు భద్రత పెరిగిందన్నారు. బీజేపీకి ముస్లింల ఓట్లు పెరుగుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకే ఓట్లు వేస్తారని ఆయన జోస్యం చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు