/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
stock market today
గత మూడు రోజులుగా విదేశీ మదుపర్ల విక్రయాలతో ఎరుపెక్కిన భారత స్టాక్ మార్కెట్ ఈరోజు తెరిపిన పడింది. ఈ రోజు ఉదయం ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో కదలాడాయి. చివరకు అవే లాభాలతో ముగింపును కూడా పలికాయి. సెన్సెక్స్ ఉదయం 84,456.75 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,391.27) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 84,906.93 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 426 పాయింట్లు పెరిగి 84,818 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా దాదాపు 140 పాయింట్లు పెరిగి 25,898 వద్ద ముగిసింది.డాలరుతో రూపాయి మారకం విలువ 90.37గా ఉంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావు శాతం కోత విధించింది. దీంతో విదేశీ మదుపర్ల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందని దేశీ మదుపర్లు భావించారు. ఈ నమ్మకం మార్కెట్ ను లాభాల్లోకి నెట్టింది. దీనికి తోడు ఆటో, మెటల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు.. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలూ రాణించడమూ కలిసొచ్చింది. ఇలా మొత్తానికి భారత స్టాక్ మార్కెట్ మూడు రోజులు ఎరుపు తర్వాత ఈరోజు పచ్చరంగును సంతరించుకుంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 21 పెరిగాయి. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 39 లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఇంధనం, ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి.టాటా స్టీల్, ఎటెర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అయితే ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి.
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్
ప్రపంచ మార్కెట్లలో మాత్రం మిశ్రమ ట్రేడింగే కనిపించింది. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.90% తగ్గి 50,148 వద్ద, కొరియా కోస్పి 0.59% తగ్గి 4,110 వద్ద ముగిశాయి. అలాగే హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.040% తగ్గి 25,530 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.70% తగ్గి 3,873 వద్ద ముగిశాయి. ఇక డిసెంబర్ 10న US డౌ జోన్స్ 1.05% పెరిగి 48,057 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్డాక్ కాంపోజిట్ 0.33%, S&P 500 0.67% లాభపడ్డాయి.
ఆల్ టైమ్ గరిష్టానికి వెండి..
మరోవైపు డిసెంబర్ 11న వెండి ధరలు ఈరోజు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, వెండి ధరలు కిలోగ్రాముకు ₹2,793 పెరిగి ₹1,88,281కి చేరుకున్నాయి. గతంలో, నిన్న ₹1,85,488గా ఉంది. ఈ సంవత్సరం, దాని ధర ₹1,00,971 (117%) పెరిగింది. బంగారం ధరలు కూడా ఈరోజు పెరిగాయి. 10 గ్రాములకు ₹808 పెరిగి ₹1,28,596కి చేరుకున్నాయి. గతంలో, ఇది ₹1,27,788గా ఉంది. అక్టోబర్ 17న బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ₹1,30,874కి చేరుకుంది.
Follow Us