/rtv/media/media_files/2025/05/12/qdjhtEmDFweMm8jDIKHF.jpg)
Stock Market Bull
దేశీయ మార్కెట్లు వరుసగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న లాభాలతో ముగించిన మార్కెట్ ఈ రోజు కూడా అదే జోష్ ను కొనసాగిస్తోంది. దానికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత కూడా మార్కెట్ సెంటిమెంట్ కు సానుకూలంగా మారింది. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 17న వడ్డీ రేట్లలో 0.25% తగ్గింపును ప్రకటించింది. దీనితో వడ్డీ రేటు పరిధి 4.00, 4.25% మధ్యకు చేరుకుంది. ఫెడ్ చివరిసారిగా డిసెంబర్ 2024లో రేట్లను తగ్గించింది.
అలాగే మరోవైపు అమెరికా నుంచి వాణిజ్య చర్చలకు పచ్చ జెండా రావడంతో..మళ్ళీ ఇన్వెస్టర్ల లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు గురవారం మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 83,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 25,400 వద్ద ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.97గా ఉంది.
స్టాక్స్ లాభనష్టాలు...
ఇక ఈ రోజు ట్రేడింగ్ లో ఐటీ స్టాక్ లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వంటి షేర్లు 1% కంటే ఎక్కువ లాభపడ్డాయి. మెటల్ స్టాక్ లు స్వల్పంగా నష్టపోయాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్..
ప్రపంచ మార్కెట్ మిశ్రమంగా కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.09% పెరిగి 45,277 వద్ద, కొరియా కోస్పి 0.94% పెరిగి 3,445 వద్ద ముగిశాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.097% తగ్గి 26,882 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.31% పెరిగి 3,888 వద్ద ముగిసింది. ఇక సెప్టెంబర్ 17న US డౌ జోన్స్ 0.57% పెరిగి 46,018 వద్ద ముగిసింది. నాస్ డాక్ కాంపోజిట్ 0.33% , S&P 500 0.097% పడిపోయాయి. సెప్టెంబర్ 17న విదేశీ పెట్టుబడిదారులు నగదు విభాగంలో రూ.989 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ పెట్టుబడిదారులు రూ.2,205 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ₹11,329 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ పెట్టుబడిదారులు ₹32,892 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
Also Read: BIG Breaking: ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు