ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. తాము 2024, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పనులు చేయడం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు జీపీఎస్‌ను దేశ వ్యాప్తంగా అములు చేసినా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీపీఎస్ విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగి తన పదవి విరమణ చేసే సమయానికి చివరి నెల వేతనంలో 50 శాతం పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ ఉందన్నారు. ఉద్యోగి భార్యా లేదా భర్తకు కూడా 60 శాతం పెన్షన్ ఇచ్చేలా రూపకల్పన చేశామన్నారు.
గత ప్రభుత్వం జీపీఎస్‌లో డీఆర్‌లను పొందుపర్చలేదన్న బుగ్గనా.. తమ ప్రభుత్వం ఇందులో డీఆర్ విధానాన్ని పొందుపర్చినట్లు వెల్లడించారు. దీంతోపాటు ఈహెచ్‌ఎస్ సైతం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. గతంలో 25 శాతం కూడా గ్యారెంటీ లేదన్న ఆయన.. ఇప్పుడు తాము 50 శాతం గ్యారెంటీ ఇస్తున్నామన్నారు. ఉద్యోగులందరూ దీనిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన కోరారు.