పోలీసులపై జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జనసేన నేతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులమని చెప్పుకుటూ డ్రెస్ కోడ్ లేకుండా, సెర్చ్ వారెంట్ కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ముందు కుక్కల్లా పని చేస్తున్న పోలీసులు.. దొంగచాటున వచ్చి జనసేన నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సీఎం జగన్ నిర్విర్యం చేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ పోలీసులకు జీతాలు తన ఫ్యాక్టరీ నుంచి వస్తున్న లాభాల నుంచి ఇవ్వడంలేదన్న శ్రీనివాస్.. రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నుల నుంచి జీతాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీసులు భరితెగించారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నాయకుల అండ చూసుకొని దొంగ చాటున వచ్చి జనసేన కార్యకర్తను అరెస్ట్ చేసి అతని ఫోన్‌ను లాకున్నారన్నారు. జనసేన కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులపై కేసు పెడుతామన్నారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు పెట్టే అసభ్యకర పోస్టులపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్నారు.
అదే సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త కానీ, తెలుగు దేశం పార్టీకి చెందిన కార్యకర్త కానీ పోస్టులు పెడితే పోలీసులు వెంటనే స్పందిస్తూ.. జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తాము వైసీపీకి పని చేస్తున్నామని ఒక లెటర్ రాసి ఇవ్వాలని బొలిశెట్టి శ్రీనివాస్ సంవాల్ చేశారు. పోలీసులు లెటర్ రాసి ఇస్తే తాము పోలీసులను కూడా వైసీపీకి చెందిన సెక్యూరిటీలుగా గుర్తిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.