Teacher Jobs : పశ్చిమ బెంగాల్(West Bengal) లోని మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు(Kolkata High Court) షాకిచ్చింది. 2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్(Teacher Recruitment) ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు జరిగిన అపాయింట్మెంట్‌లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరగడం వల్ల ఇది చెల్లదని తీర్పునిచ్చింది. వెంటనే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు సూచించింది. దీంతో 25,753 మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలున్నాయి. అలాగే ఆనాటి వ్యవహారంపై మరింత దర్యాప్తు జరిపి నెలరోజుల్లోగా రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది.
Also Read: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..!
అలాగే 2016 టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము ఇప్పటివరకు అందుకున్న వేతనాలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. వారి నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచనలు చేసింది. అంతేకాదు 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. గతంలో ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. అయితే కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ టీఎంసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
ఇదిలాఉండగా.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతులకు టీచర్లతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2106లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్షను (SLST) నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియలో 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అయితే ఈ నియామక ప్రక్రియలో ఖాళీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చి అక్రమ రీతిలో టీచర్లు నియామకం అయినట్లు ఆరోపణలు రావడంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో తాజాగా దీనిపై విచారించిన కోల్‌కతా హైకోర్టు.. 2016లో నిర్వహించిన ఆ పరీక్ష చెల్లదంటూ తీర్పునిచ్చింది.
Also Read: 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు