బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దీనిపై స్పందించారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. దేశంలో ఎమర్జెన్సీ, అయోధ్య పొరాటంలో పాల్గొన్న అద్వానీకి భారత రత్న ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్
ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోంది
అన్ని సర్వేల్లో కూడా బీజేపీ గెలుస్తుందని.. ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. కాంగ్రెస్‌పై దేశద్రోహం కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోందని.. ఆ ఆందోళనతోనే వాళ్లు పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారంటూ విమర్శించారు.
నిజమైన అర్హులకే అవార్డులు
అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా ఇలా మాట్లాడిన చరిత్ర ఉందన్నారు. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేవని.. కానీ ఇప్పుడున్న సమాజంలో నిజమైన అర్హులకు మాత్రమే బీజేపీ అవార్డులిస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read: తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్ పాఠాలు!