అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో రోజురోజుకి ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పలువురు విపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రప్రభుత్వం తమ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ మేరకు తమకు యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. హ్యాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తదితరులు ఉన్నారు. యాపిల్ కంపెనీ దాదాపు 20 మంది నేతల ఐఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపించింది. 'ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే కొంతమంది హ్యాకర్లు మీ ఐఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ ఫోన్‌లో ఉన్నటువంటి సున్నితమైన సమాచారం, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్‌ను కూడా వాళ్లు యాక్సేస్ చేసే అవకాశాలు ఉన్నాయని' ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోండని ఆ మేసేజ్‌లో తెలిపింది.
ఇలా యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చినవారి జాబితాలో తెలంగాణకు చెందిన మంత్రి కేటీఆర్, అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. మరో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే తమ ఎంపీల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. నాతో సహా పలువురు నేతలకు యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయని.. ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమని.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్ చేశారు. అలాగే ఈ అలర్ట్ మెసేజ్‌లపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. నాలాంటి వారు చెల్లించే పన్నులతో ఉద్యోగులను బీజీగా ఉంచడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మోదీ సర్కార్ అదానీకి అమ్మినవాటిన దాచేందుకు చేయగలిగిందంతా చేస్తోందని విమర్శించారు. మీరు కావాలనుకునే వారందరిపై హ్యాక్ చేయండి. కానీ మిమ్మల్ని ప్రశ్నించడం మాత్రం ఆపది లేదంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఆరోపణలపై అటు బీజేపీ కూడా స్పందించింది. విపక్ష నేతలు.. కేంద్రమే ఫోన్లు హ్యక్ చేసేందుంకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. దీనిపై యూపిల్ సంస్థ నుంచి స్పష్టత వచ్చేవరకు ఎందుకు ఆగలేకపోతున్నారంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాల్వియా ప్రశ్నలు సంధించారు. విపక్ష ఎంపీలకు వచ్చిన అలర్ట్ మెసేజ్‌లు యాపిల్‌లోని అల్గారిథమ్ పనితీరులో లోపం వల్లే అలా వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈ విషయంపై కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పాయి. మరోవైపు.. యాపిల్ అలర్ట్ మెసేజ్‌లపై కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పలు ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దాదాపు 150 దేశాల్లో పలువురికి యాపిల్ ఇలా అలర్ట్ నోటిఫికేషన్లు పంపించిందని.. వారి ఫోన్లను ఎవరూ కూడా హ్యాక్ చేయలేరని యాపిల్ కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. అలాగే కేంద్రమే ఈ పని చేయిస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దేశ అభివృద్ధిని కోరుకోని వారు మాత్రమే ఇలాంటి రాజకీయాలకు దిగజారుతారంటూ విమర్శించారు.